నిషేధిత సిగరెట్ ప్యాకెట్లు విక్రయిస్తున్నారన్న సమాచారంతో విజిలెన్స్ అధికారులు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో సోమవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ప్రధానంగా మూడు దుకాణాలపై దాడులు జరిపి రూ.16,41,530 విలువైన సిగరెట్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని సంబంధిత యజమానులపై మూడు కేసులు నమోదు చేసినట్టు రీజనల్ విజిలెన్స్-ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి కేఎస్‌ఎస్వీ సుబ్బారెడ్డి తెలిపారు. అమలాపురం పట్టణంలోని గొల్లగూడెం బైపాస్ రోడ్డు రామకృష్ణ వీధిలోని ఎంఎస్ నిషిక ఎంటర్‌ప్రైజెస్‌పై తొలుత దాడులు జరిపారు. ఏడు బ్రాండ్లకు సంబంధించి నిషేధిత సిగరెట్లను గుర్తించి రూ.14,33,600 విలువైన ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత పొగాకు ఉత్పత్తుల అక్రమ విక్రయాలు చేస్తున్న షాపు యజమానిపై క్రిమినల్ కేసు నమోదు కోసం అమలాపురం పట్టణ పోలీసు స్టేషన్‌కు అప్పగించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవుకు చెందిన నున్న వెంకట బుచ్చిరాజు గుంటూరుకు చెందిన వెంకట్ అనే వ్యక్తి నుంచి నిషేధిత సిగరెట్లను సేకరించి తన అల్లుడైన ఎస్వీఆర్‌ఎన్‌ఎస్ శోభిత్ ద్వారా ఎంఎస్ నిషిక ఎంటర్‌ప్రైజెస్ వ్యాపార ప్రాంగణంలో ఉంచి రిటైల్ విక్రయాలు నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. సిగరెట్ ప్యాకెట్లపై చట్టబద్ధమైన వివరాలను ప్రకటించనందున లీగల్ మెట్రాలజీ అధికారులు ఎల్‌ఎం యాక్టు-2009 కింద కేసు నమోదు చేశారు. అనంతరం ఎర్రమిల్లి వారి వీధిలోని ఎంఎస్ వరలక్ష్మి జనరల్ మర్చంట్స్‌ను తనిఖీ చేయగా నిషేధిత సిగరెట్ ప్యాకెట్లయిన హార్బర్ గోల్డ్, గోల్డ్ ఫిల్టర్, గోల్డ్ విమల్ తదితర 2,080 ప్యాకెట్లను గుర్తించారు. వీటి విలువ రూ.1,09,200గా నిర్ధారించారు. షాపు యజమాని జీఎస్టీ సైతం నమోదు చేసుకోలేదు. స్టాకుకు సంబంధించిన ఖాతాల పుస్తకాలు, కొనుగోలు అమ్మకాల బిల్లులు నిర్వహించట్లేదని జీఎస్టీ అధికారులు గుర్తించారు. అనంతరం అదే వీధిలోని శ్రీదేవి జనరల్ స్టోర్స్‌లో తనిఖీలు జరిపి రూ.1,98,730 విలువైన 3,873 నిషేధిత సిగరెట్ ప్యాకెట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆయా షాపుల యజమానులపై కేసుల నమోదుకు సిఫార్సు చేశారు. దాడుల్లో విజిలెన్స్ అధికారులు పి.ముత్యాలనాయుడు, శ్రీనివాసరెడ్డి, నాగవెంకటరాజు, భార్గవమహేష్, లక్ష్మీనారాయణ, నవీన్‌కుమార్, జగన్నాథరెడ్డి, జీవా, లోవరాజు, వలీ, వీరబాబు, కిశోర్ పాల్గొన్నారు.