తాడేపల్లి క్యాంప్ ఆఫీసు ప్యాలెస్ అని లోకేష్ మాట్లాడతాడని, ఎర్రబుక్కు రాసింది నిజమైతే, ఖలేజా ఉన్న రాజకీయ నాయకుడైతే.. హైదరాబాద్ లో మీ జూబ్లీహిల్స్ ఇంటి ఫొటోలు ఎవరికైనా చూపించారా? అని లోకేష్ ను పేర్ని నాని ప్రశ్నించారు. ఒకసారి సాక్షి ఛానల్ సహా మీడియా టూర్ పెట్టాలని, అలాగే జగన్ మోహన్ రెడ్డి గారి ఇంటికి కూడా మీడియా టూర్ పెడదామని సవాల్ విసిరారు. లేదా రిటైర్డ్ జడ్జితో వ్యాల్యుయేషన్ చేయిద్దామన్నారు. ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఇవాళ జగన్ మోహన్ రెడ్డి గారి వరకు చంద్రబాబు అవసరాలు తీరడం కోసం, రాజ్య కాంక్ష తీర్చడం కోసం ఎంతటి వ్యక్తినైనా వ్యక్తిత్వ హననం చేయనిదే వీళ్లు వదిలిపెట్టరన్నారు. 21.07.2016న జీవో నంబర్ 340ని చంద్రబాబు గారు తెచ్చారని, పార్టీ ఆఫీసులకు స్థలాలిచ్చిన ఆనవాయితీని తెచ్చామన్నారని గుర్తు చేశారు. అందులో కేటగిరీల వారీగా జాతీయ పార్టీలు, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు, ఎవరికైతే 50 శాతం తగ్గకుండా శాసనసభలో సభ్యులున్నారో వాళ్ల కేంద్ర కార్యాలయం కట్టుకోవడానికి 4 ఎకరాలు కేటాయించవచ్చన్నారని తెలిపారు. ఆ సంఖ్య 25 శాతం పైన ఉంటే ఆ పొలిటికల్ పార్టీకి అర ఎకరం, 25 శాతం లోపు ఉండి ఒక్క సభ్యుడైనా ఉంటే 1000 గజాలు, అలాగే జిల్లా కేంద్రాల్లోనూ స్థలాలు ఇవ్వొచ్చని పేర్కొన్నట్లు తెలిపారు.