దక్షిణాది పొగాకు మార్కెట్ మళ్లీ పుంజుకుంది. బుధవారం కిలో గరిష్ఠ ధర ఏకంగా రూ.362 పలికింది. ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది పొగాకు మార్కెట్ జోరుగా సాగుతోంది. పక్షం క్రితం గరిష్ఠ ధర కిలో రూ.360కి చేరింది. అనంతరం నాలుగు రోజుల తర్వాత రూ.330కి పడిపోయింది. దాదాపు పది రోజులపాటు కిలో రూ.330నుంచి 338 వరకూ సాగుతూ వచ్చింది. మూడు రోజుల క్రితం రూ.343 పలికింది. అలా పెరుగుతూ బుధవారం మార్కెట్లో గరిష్ఠ ధర కిలో రూ.362కు చేరింది. ఒంగోలు -1 వేలం కేంద్రంలో ఈ రేటు దక్కింది. పలు ఇతర కేంద్రాల్లో గరిష్ఠ ధరలు కిలో రూ.360కి అటు ఇటుగా ఉన్నాయి. అంతేకాక లోగ్రేడ్‌లో నాణ్యమైనదిగా భావించే బ్రౌన్ రకానికి మరింత డిమాండ్ ఏర్పడింది. బుదవారం ఆ గ్రేడ్ బేళ్ల గరిష్ఠ ధర కిలో రూ.310 పలికింది. మూడు రోజుల క్రితం వరకూ ఆగ్రేడ్ గరిష్ఠ ధరలు కిలో రూ.260కి అటు ఇటుగా ఉన్నాయి. అయితే ఒక్కసారిగా కిలోకు రూ.50 వరకు ధర పెరిగింది. లోగ్రేడ్‌లో నాసిరకంగా భావించే వాటికి కూడా భారీ ధరలు పలుకుతున్నాయి. అటు మేలు, ఇటు బ్రౌన్ రకం బేళ్ల కోసం పలు కంపెనీల బయ్యర్లు వేలం కేంద్రాల్లో పోటీ పడుతున్నారు. పొగాకు మార్కెట్లో గుత్తాధిపత్యం వహించే ఐటీసీ బయ్యర్లకు కూడా అవసరమైన మేర బేళ్లు దొరకని పరిస్థితి కనిపిస్తోంది. దీంతో వారు కూడా బేళ్ల కోసం పోటీపడుతూ ధరలు పెంచక తప్పడం లేదు. ఈస్థాయి ధరలు మార్కెట్లో ఎంత కాలం ఉంటాయన్న విషయం అలా ఉంచితే పొగాకు బోర్డు చరిత్రలో గరిష్ఠ ధర కిలో రూ.362 పలకడం ఇదే ప్రథమం. ఇదిలా ఉండగా దక్షిణాది మార్కెట్లో ఇప్పటి వరకూ సుమారు 83 మిలియన్ కిలోల పొగాకు విక్రయాలు జరిగాయి. సగటు ధర కిలోకు రూ.354.50 లభించింది.