రాజమహేంద్రవరం జీజీహెచ్‌లో మొత్తం ఏడు డయేరియా కేసులు నమోదయ్యాయి. వీటిలో మూడు కేసులకు ఆసుపత్రి వైద్యులు మెరుగైన వైద్యసేవలందించడంతో కోలుకోగా డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం నాలుగు కేసులకు చికిత్స అందిస్తున్నారు. వీరంతా మహిళలే. డయేరియా విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ ప్రభుత్వం ఇప్పటికే ముందస్తు హెచ్చరికలు, ఆదేశాలు జారీచేయడంతో అప్రమత్తమైన జీజీహెచ్ అధికారులు డయేరియా కేసులకు చికిత్స అందించడానికి ప్రత్యేకంగా ఒక వార్డును ఏర్పాటు చేశారు. రాజమహేంద్రవరం సిటీ పరిధిలో మూడు కేసులు నమోదు కాగా వీరిలో సీటీఆర్‌ఐ ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల మహిళ ఒకరున్నారు. ఈమె ఈనెల 23న జీజీహెచ్‌లో చేరారు. మరో ఇద్దరు మహిళలు 24, 26 తేదీల్లో చేరారు. గండేపల్లి పీహెచ్‌సీ నుంచి 45 ఏళ్ల ఒక మహిళను అనుమానిత లక్షణాలతో జీజీహెచ్‌కు రిఫర్ చేశారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. రాజవోలుకు చెందిన 53 ఏళ్ల వ్యక్తి కోలుకోవడంతో అతన్ని డిశ్చార్జి చేశారు. మరొకరు కొంతమూరు ప్రాంతానికి చెందిన వ్యక్తి అని సమాచారం. ఈ నేపథ్యంలో డయేరియా కేసుల కోసం జీజీహెచ్ మెడికల్ యూనిట్ సమీపంలో ప్రత్యేకంగా మేల్/ఫిమేల్ వార్డును ఏర్పాటుచేశారు. జీజీహెచ్ జనరల్ మెడిసిన్ హెచ్‌వోడీ డాక్టర్ పీవీవీ సత్యనారాయణ పర్యవేక్షణలో బాధితులకు వైద్యులు, వైద్య సిబ్బంది చికిత్స అందిస్తున్నారు. అయితే డయేరియా ప్రత్యేక వార్డులో వైద్య సిబ్బంది కొరత ఉందని చెబుతున్నారు. స్టాఫ్‌నర్సు, ఇతర నర్సింగ్ స్టాఫ్ అవసరమైనమేరకు లేకపోవడంతో వైద్యసేవలకు విఘాతం కలుగుతున్నదనే విమర్శలున్నాయి.