ఐదు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో తాము ఎలా బతకాలంటూ ఏలూరు ప్రభుత్వాస్పత్రి ఆరోగ్యశ్రీ విభాగం స్ర్టెక్చర్ బాయ్(ఎంఎన్‌వో) మేడిద దుర్గారావు ఆందోళన చేపట్టాడు. ఫిబ్రవరి నుంచి ఆ విభాగంలో పని చేసే 22 మంది సిబ్బందికి జీతాలు ఇవ్వడం లేదు. ఈ క్రమంలో దుర్గారావు తన భార్య, ఇద్దరు పిల్లలతో బుధవారం ఉదయం ప్రభుత్వాస్పత్రికి వచ్చాడు. పురుగుల మందు డబ్బా, పెట్రోల్ బాటిల్ పట్టుకుని జీతాలు ఇవ్వకపోతే తామంతా ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిం చారు. తన కుమార్తె అనారోగ్యంతో బాధపడుతోందని, పైసా అప్పు పుట్టలేదని, జీతాలు ఇచ్చి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదంటూ బోరున విలపించాడు. పరిస్థితి గమనించిన తోటి ఉద్యోగులు అతనికి నచ్చచెప్పి ఆస్పత్రి సూపరింటెండెంట్ రూమ్ దగ్గర నుంచి తీసుకువెళ్ళిపోయారు. డీఎంఈ అనుమతి లేకపోవడం వల్లే జీతాలు ఇవ్వలేకపోతున్నారని, అనుమతి రాగానే చెల్లిస్తారని ఆస్పత్రి అధికారి వెల్లడించారు.