గత ఎన్నికల్లో టీడీపీ పక్షాన నిలబడిన మున్సిపాల్టీ ప్రజల రుణం తీర్చుకుంటానని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ బోను గౌరీశ్వరీ అధ్యక్షతన మున్సిపల్ సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మొట్టమొదటి సారిగా ఎక్స్ఆఫీషియో సభ్యుడిగా హాజరైన విజయచంద్ర , కౌన్సిల్ సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. మున్సిపాల్టీలో తాగునీరు, పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా కేంద్రంలో నడిబొడ్డులో ఉన్న మురికివాడల్లోగల ప్రజల జీవన పరిస్థితి చాలా దారుణంగా ఉందని, వారి కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రచించాల్సిన అవసరం ఉందని తెలిపారు. మున్సిపాల్టీ అభివృద్ధికి అధికార, ప్రతిపక్షాలే కాకుండా కుల, మత బేధాలకు అతీతంగా మనమంతా సమిష్టిగా పనిచేద్దామని పిలుపునిచ్చారు.