విశాఖ నగర సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ రవిశంకర్ అయ్యన్నార్‌ను ప్రభుత్వం శుక్రవారం బదిలీ చేసింది. ఆయన స్థానంలో రాష్ట్ర శాంతి భద్రతల విభాగం అడిషనల్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్న డాక్టర్ శంక బ్రతబాగ్చిని నియమించింది. రవిశంకర్ అయ్యన్నార్‌కు కీలకమైన సీఐడీ ఏడీజీగా నియమించింది.గత ఏడాది సెప్టెంబరు 14న నగర పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన రవిశంకర్ అయ్యన్నార్‌కు బదిలీ కానున్నదనే ప్రచారం ప్రభుత్వం మారినప్పటి నుంచి జరుగుతోంది. ఎన్నికల సమయంలో వైసీపీ నేతల కార్యక్రమాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అనుమతులు మంజూరుచేసి, కూటమి నేతల సభలు, కార్యక్రమాలకు ఇబ్బందులు పెట్టారనే ఆరోపణలు సీపీపై ఉన్నాయి. పోలింగ్ జరిగిన తర్వాత కంచరపాలెం బర్మా కాలనీలో టీడీపీకి ఓటేశారనే కారణంతో ఒక కుటుంబంపై కొంతమంది దాడి చేస్తే, ఆ ఘటనకు రాజకీయాలకు సం బంధం లేదని సీపీ తేల్చిపారేశారని కూటమి నేతలు ఆరోపించారు. పైగా దీనిపై ప్రెస్‌మీట్ పెట్టి ఆ గొడవకు వ్యక్తిగత కక్షలే కారణమని సీపీ చెప్పడమే కాకుండా, డీసీపీ-2తో కూడా చెప్పించారని అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో రవిశంకర్ అయ్యన్నార్ బదిలీ ఖాయమని అంతా భావించారు. ఆయన స్థానంలో ప్రభుత్వం పలువురి పేర్లను పరిశీలించింది. చివరకు శంకా బ్రత బాగ్చిని నియమించింది.