కత్తిపూడి–పామర్రు జాతీయ రహదారిలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి దుర్మరణం చెందాడు. కైకలూరు మండలం గుమ్మళ్ళపాడు గ్రామానికి చెందిన యాళ్ళ భీమరాజు (45) పనిమీద పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు తన ద్విచక్రవాహనంపై వెళ్లి రాత్రి సుమారు 8 గంటల సమయంలో తన స్వగ్రామం వస్తుండగా సోమేశ్వరంలోని ఉప్పుటేరు సెంటర్లో వెనుక నుంచి లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో భీమరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. కైకలూరు రూరల్ ఎస్సై టి రామకృష్ణ సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కైకలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.