ప్రభుత్వ పథకాలను, ప్రయోజనాన్ని క్షేత్రస్థాయిలో అర్హులైన వారందరికీ చేర్చే బాధ్యత అధికారులపై ఉందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఉండ్రాజవరంలో మండలస్థాయి అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో అందిస్తూ, సుపరిపాలనకు అధికారులు సహకరించాలన్నారు. జూలై నెల నుంచి అర్హులైన పింఛను లబ్ధిదారులకు ప్రభుత్వ హామీ మేరకు రూ.4 వేలు పంపిణీ చేస్తారన్నారు. వీటితోపాటు మూడు నెలలకు వెయ్యి చొప్పున రూ.3 వేలు కలిపి మొత్తం రూ.7వేలు లబ్ధిదారులకు అందజేస్తారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పడినప్పటికీ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్లు అందిస్తామన్నారు. విద్యాలయాల్లో డ్రాప్‌అవుట్ లేకుండా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని కోరారు. పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయాలని చెప్పారు. విద్యార్థులకు మంత్రి దుర్గేష్ విద్యాకిట్లను పంపిణీ చేశారు. అనంతరం పలువురు మంత్రి దుర్గేష్‌ను సత్కరించారు. కార్యక్రమంలో తహసిల్దార్ కె. నవీన్‌కుమార్, ఎంపీడీవో కె. నరేంద్రరెడ్డి, ఈవోపీఆర్డీ జేవీడీవీ ప్రసాద్, నాయకులు సింహాద్రి రామకృష్ణ, గన్నమని వెంకటసుబ్రహ్మణ్యం, ఇతర నాయకులు పాల్గొన్నారు.