ఏలూరు నగర పాలక సంస్థ అడిషనల్ కమిషనర్ జి.చంద్రయ్యకు కోర్టు ధిక్కరణ కింద హైకోర్టు ఆరు నెలల జైలు, రూ.2 వేలు జరిమానా విధించింది. ఆయన మచిలీపట్నం మునిసిపల్ కమిషనర్‌గా పనిచేసిన సమయంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్ సస్పెండ్ అయ్యారు. కొవిడ్ సమయంలో తప్పిదాలకు పాల్పడ్డారని ఏసీబీ అధికారుల నివేదిక ఆధారంగా వెంకటేశ్‌ను డైరెక్టరేట్ ఆఫ్ మునిసిపల్ అడ్మినిస్ర్టేషన్(డీఎంఏ) అధికారులు సస్పెం డ్ చేశారు. దీనిపై ఆయ న హైకోర్టుకు వెళ్లగా.. సస్పెన్షన్‌ను రద్దు చేసి విధుల్లో చేర్చు కోవాలని ఆదేశాలు ఇచ్చింది. దీనిపై వెంకటేశ్‌ను విధుల్లో చేర్చుకోవాలని డీఎంఏ అప్పటి మునిసిపల్ కమిషనర్ చంద్రయ్యకు ఉత్తర్వులు ఇచ్చారు. కాని వైసీపీ ప్రజా ప్రతినిధుల ఒత్తిడి మేరకు వెంకటేశ్‌ను విధుల్లోకి చేర్చుకోకపోవడంతో ఆయన మళ్ళీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు ధిక్కరణ కింద చంద్రయ్యకు ఆరు నెలలు జైలు శిక్ష, రూ.2 వేలు జరిమానా విధిస్తూ శుక్రవారం జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు తీర్పునిచ్చారు.