డ్రైనేజీ పక్కనే చేతిపంపు.. ఈ నీరు మీరు తాగుతారా ధర్మంగా చెప్పండి, మరి పిల్లలచేత ఎలా తాగిస్తున్నారు అంటూ రామచంద్రపురం, తాళ్లపొలం ప్రాథమికోన్నత పాఠశాల హెచ్‌ఎం లక్ష్మణరావును మంత్రి సుభాష్ ప్రశ్నించారు. శుక్రవారం రామచంద్రపురం మండలం తాళ్లపొలం ప్రాథమికోన్నత పాఠశాలను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. హెచ్‌ఎం పిల్లలు ఇంటివద్ద నుంచి నీరు తెచ్చుకుంటున్నారని చెప్పగా మీరు ఇంటివద్ద నుంచి తెచ్చుకున్న నీరు ఎప్పటివరకు వస్తున్నాయని విద్యార్థులను మంత్రి ప్రశ్నించారు. కొద్దిసేపటికే అయిపోతున్నాయని తరువాత చేతిపంపు నీళ్లు తాగుతున్నామని విద్యార్థులు మంత్రికి తెలిపారు. రేపటి నుంచి రక్షిత మంచినీరు టిన్నులు తెప్పించండి డబ్బులు ఇస్తాను అని మంత్రి హెచ్‌ఎంను ఆదేశించారు. అదేవిధంగా పట్టణంలో మున్సిపల్ బాలికోన్నత పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థినులతో మధ్యాహ్న భోజనం గురించి ప్రశ్నించారు. మంత్రి స్వయంగా భోజనం రుచి చూశారు. ఫోన్లు పాఠశాల సమయంలో వాడకం తగ్గించాలని ఆయన సూచించారు. ఆర్‌వో ప్లాంటు పరిశీలించారు. అనంతరం కృత్తివెంటి పేర్రాజు పంతులు ప్రభుత్వ జాతీయోన్నత పాఠశాలను తనిఖీ చేశారు. డైనింగ్ హాలు, బాత్‌రూమ్‌లు పరిశీలించారు. బాత్‌రూమ్‌లు క్లీనింగ్ చేయించాలని, రక్షిత మంచినీరు పిల్లలకు సరఫరా చేయాలని ఆదేశించారు. అనంతరం ఎస్సీ వసతి గృహాన్ని తనిఖీ చేశారు. మరుగుదొడ్లు, శ్లాబు పెచ్చులు ఉడి పడటం, అపారిశుధ్యంపై మంత్రి సుభాష్ అసహనం వ్యక్తంచేశారు. విద్యార్థులకు వండిపెడుతున్న బి య్యం తనిఖీ చేశారు. నూకలు బియ్యం చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్నబియ్యం పెడతామని చెప్పి నాసిరకం బియ్యం ఇచ్చారని గత వైసీపీ ప్రభుత్వంలో అన్ని శాఖల్లోను అవినీతి పేరుకుపోయిందని ఆరోపించారు. డిగ్రీ కళాశాల, ఎస్సీ వసతి గృహం వెనుక పారిశుధ్యం దారుణంగా ఉండడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. గంటల వ్యవధిలో పారిశుధ్యం మెరుగుపరచాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాల నిర్మాణానికి రూ.5 కోట్లు కేంద్ర ప్రభుత్వ నిధులు మంజూరు అయిన పక్షంలో పనులు చేపట్టడంపై మంత్రి సుభాష్ ప్రిన్సిపాల్ కేసీ సత్యలత, కమిటీ సభ్యులు గరిగిపాటి సూర్యనారాయణమూర్తి, శిష్టా అమ్మన్న పంతులు, మేడిశెట్టి శేషారావులతో చర్చించారు. రామచంద్రపురం మండలం వెంకటాయపాలెం సచివాలయం తనిఖీ చేసి సిబ్బంది వేళకు రాకపోవడం అధికారులకు ఫోన్ చేసి ప్రశ్నించారు. పంచాయతీలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఫోటోలు పెట్టకపోవడంపై సుభాష్ ప్రశ్నించారు.