ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగడంతో మిస్సింగ్ బాలిక ఆచూకీ దొరికింది. దాదాపు 9 నెలల తర్వాత ఆ అమ్మాయి ఎక్కడుందో విజయవాడ పోలీసులు కనిపెట్టారు. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంనకు చెందిన శివకుమారి కలిశారు. తన కుమార్తె కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు.. వెంటనే రంగంలోకి దిగిన పవన్.. బాలిక మిస్సింగ్ కేసు వ్యవహారంలో సీఐకి ఫోన్ చేసి డిప్యూటీ సీఎం స్వయంగా మాట్లాడారు. వెంటనే పోలీసులు ఆమె కోసం స్పెషల్ టీమ్ గాలింపు మొదలుపెట్టింది.. చివరికి ఆమె విజయవాడ రామవరప్పాడుకు చెందిన యువకుడితో జమ్మూలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఇద్దరినీ అదుపులోకి తీసుకుని.. జమ్మూ నుంచి విజయవాడకు తీసుకొస్తున్నారు.
విజయవాడలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను బాలిక తల్లి కలిశారు. విజయవాడలో తన కుమార్తె చదువుకుంటోందని.. మైనర్ అయిన ఆమెను ప్రేమ పేరుతో ఓ యువకుడు ట్రాప్ చేశాడని ఫిర్యాదు చేశారు. తాము విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని.. తమ కుమార్తె జాడ తెలిసినా పోలీసులు స్పందించడం లేదని కన్నీటి పర్యంతం అయ్యారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారని.. ఆ ఎఫ్‌ఐఆర్ కాపీని కూడా డిప్యూటీ సీఎంకు అందజేశారు. ఆ వెంటనే పవన్ కళ్యాణ్ మాచవరం సీఐకి కాల్ చేశారు.. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధితుల్ని, జనసేన నేతల్ని మాచవరం పోలీస్ స్టేషన్‌కు పంపించారు. డిప్యూటీ సీఎం ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగి ఆ బాలిక ఆచూకీని కనిపెట్టారు.
మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్నారు. కాకినాడ కలెక్టరేట్లో శాఖల వారి సమీక్షలు నిర్వహిస్తున్నారు. శాఖల వారీగా కాకినాడ జిల్లాలో ఉన్న పరిస్థితుల్ని పవన్ కళ్యాణ్‌కు అధికారులు వివరించారు. ఈ సమీక్షలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జిల్లాలోని ప్రధాన సమస్యలపై ప్రధానంగా చర్చించారు. అలాగే పంచాయతీరాజ్, గ్రామీణ నీటిపారుదలశాఖల పరిధిలోని పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ సోమవారం పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. అక్కడ ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురాన్ని దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చి దిద్దుతాను అన్నారు డిప్యూటీ సీఎం. నియోజకర్గంలో సమస్యల్ని త్వరలోనే పరిష్కరిస్తానని తెలిపారు పవన్ కళ్యాణ్.