ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ప్రజా దర్భార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఉండవల్లిలోని నివాసంలో ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు.. వారి సమస్యల్ని అడిగి తెలుసుకుంటున్నారు. ప్రజా దర్భార్‌లో మంత్రి లోకేష్‌ను హైదరాబాద్‌లో ఉంటున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన క్యాబ్ డ్రైవర్‌లు కలిశారు. తెలంగాణ ప్రభుత్వ నిబంధనలపై లోకేష్‌కు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర విజభన తర్వాత తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది.. అయితే ఆ కాలపరిమితి ఇటీవలే ముగిసింది.. అయితే తమ వాహనాలకు మళ్లీ లైఫ్ ట్యాక్స్ చెల్లించాలని తెలంగాణలో అధికారులు చెబుతున్నారని క్యాబ్ డ్రైవర్‌లు లోకేష్‌కు వివరించారు. వెంటనే స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.
తమ వాహనాలకు ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పటికే లైఫ్ ట్యాక్స్ చెల్లించామని.. మళ్లీ లైఫ్ ట్యాక్స్ కట్టాలంటే భారమవుతుందన్నారు. తాము ఆర్థికంగా నష్టపోతామని.. తమ వాహనాలకు హైదరాబాద్‌లో మరికొంతకాలం వెసులుబాటు కల్పించేలా చూడాలని కోరారు. అలాగే ఆంధ్రప్రదేశ్ వాహనాల విషయంలో హైదరాబాద్‌లో అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారని.. ఈ విషయాన్ని పరిశీలించాలని రిక్వెస్ట్ చేశారు. త్వరలోనే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ ఉందని తెలిసిందని.. తమ సమస్యలకు పరిష్కారం లభించేలా చూడాలని కోరారు క్యాబ్ డ్రైవర్లు.
మరోవైపు ప్రజాదర్బార్‌లో మంత్రి లోకేష్‌ను ఉపాధ్యాయ సంఘాల నాయకులు కూడా కలిసి వినతిపత్రం అందజేశారు. ఎన్నికల కోడ్ కారణంగా బదిలీల ప్రక్రియ అమలు కాలేదని.. ఆగిపోయిన బదిలీ ఉత్తర్వుల అమలుకు చర్యలు తీసుకోవాలని రిక్వెస్ట్ చేశారు. గత ప్రభుత్వంలో ఉపాధ్యాయల బదిలీల్లో భారీగా అవినీతి జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి.. తమ ప్రభుత్వం మాత్రం నిబంధనల ప్రకారం ఉపాధ్యాయ బదిలీలు చేపడుతుందన్నారు. ఉపాధ్యాయ బదిలీల అంశంలో తాను చెడ్డ పేరు తెచ్చుకోదల్చుకోలేదన్నారు మంత్రి నారా లోకేష్.
కావలి ప్రమాదంపై లోకేష్ ఆరా
నెల్లూరు జిల్లా కావలిలో జరిగిన స్కూల్ బస్సు ప్రమాదంపై మంత్రి నారా లోకేష్ ఆరా తీశారు. స్కూల్ బస్సును లారీ ఢీకొన్న ఘటన తనను తీవ్ర ఆందోళనకు గురిచేసిందని.. ఈ ఘటనలో క్లీనర్ చనిపోవడం బాధాకరమన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అన్ని స్కూళ్ల యాజమాన్యాలు బస్సుల్ని కండిషన్‌లో ఉంచుకోవాలని .. బస్సుల ఫిట్ నెస్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు.