కడప జిల్లా ప్రొద్దుటూరులో పింఛన్ డబ్బులు చోరీ ఘటన కలకలంరేపింది. బ్యాంకు నుంచి తెచ్చిన డబ్బులు లబ్ధిదారులకు పంపిణీ చేయకపోవడంతో.. ఏం జరిగిందని ఆరా తీస్తే అసలు గుట్టు బయటపడింది. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని ఏడో వార్డు సచివాలయంలో ఇంజనీరింగ్ సెక్రటరీగా మురళీ మోహన్ విధులు నిర్వహిస్తున్నారు. బ్యాంక్ నుంచి ముందుగానే డబ్బుల్ని డ్రా చేయగా.. సోమవారం ఉదయం 9 గంటలైనా లబ్ధిదారులకు పింఛన్ డబ్బులు పంపిణీ చేయలేదు. ఏం జరిగిందని మున్సిపల్ కమిషనర్ ఆరా తీయగా.. తాను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్నట్లు మురళీ చెప్పాడు.
మున్సిపల్ కమిషనర్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా డీఎస్పీ రంగంలోకి దిగారు. నేరుగా ఆస్పత్రికి వెళ్లి ఆరా తీశారు.. మురళీని అడిగి వివరాలు తెలుసుకున్నారు. తాను పింఛన్లు పంపిణీ చేద్దామని బైక్‌పై వెళుతుంటే స్పృహ తప్పి కిందపడిపోయానని.. కొద్దిసేపటికి లేచి చూస్తే డబ్బులు కనిపించలేదని చెప్పాడు. స్థానికులు తనను 108 వాహనంలో ఆస్పత్రిలో చేర్చినట్లు వివరించాడు. పోలీసులకు ఎందోక అనుమానం రావడంతో అతడిని ప్రశ్నించగా.. అప్పుడు నిజం చెప్పాడు. ఆన్‌లైన్ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకుని పింఛన్ డబ్బుల్ని వాడుకున్నట్లు తేలింది. వెంటనే మురళీమోహన్‌ను మున్సిపల్ కమిషనర్ సస్పెండ్ చేయగా.. పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.
అన్నమయ్య జిల్లాలో పింఛన్ల డబ్బుల్లో సచివాలయ సిబ్బంది చేతివాటం
అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలంలోని ఓ గ్రామంలో సచివాలయ సిబ్బంది వాలంటీర్‌తో కలిసి పింఛన్ డబ్బుల విషయంలో చేతివాటం ప్రదర్శించారు. ఆ ఊరిలో ఈ 40కి పైగా పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు. సచివాలయ సిబ్బంది.. గతంలో పనిచేసిన వాలంటీర్‌గా పనిచేసిన వ్యక్తిని తీసుకెళ్లి.. పింఛన్ పంపిణీ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. తమకు సరిగా జీతం ఇవ్వలేదని.. అందుకే ఒక్కో పింఛన్ లబ్ధిదారుడి నుంచి రూ.200 వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. వెంటనే స్థానికులు, రాజకీయ నేతలు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత వసూలు చేసిన డబ్బుల్ని మళ్లీ లబ్ధిదారులకు అందజేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం బయటకు రాకుండా బెదరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.