కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో తరలివస్తుంటారు. శ్రీవారిని దర్శించుకుని తరిస్తూ ఉంటారు. అలా వచ్చే వేలాదిమంది భక్తులు స్వామి వారి అన్నప్రసాదాన్ని స్వీకరిస్తుంటారు. వెంగమాంబ అన్నప్రసాద భవనంలో అన్న ప్రసాదాన్ని స్వీకరించి.. స్వామి వారి కృపకు పాత్రులవుతూ ఉంటారు. అయితే శ్రీవారి అన్న ప్రసాదం తయారీ విషయంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. అన్నప్రసాదం నాణ్యతపై భక్తుల నుంచి గత కొన్ని రోజులుగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. అన్న ప్రసాదం తయారీలో సేంద్రీయ బియ్యం వాడకాన్ని ఆపివేయాలని నిర్ణయించింది. సేంద్రీయ బియ్యం వాడకాన్ని నిలిపివేసి.. అన్న ప్రసాదం తయారీకి గతంలో వాడిన బియ్యాన్నే వినియోగించాలని నిర్ణయించింది.
వీటితో పాటుగా అన్నప్రసాదాల దిట్టం కూడా పెంచాలని టీటీడీ నిర్ణయించింది, కొవిడ్ సమయంలో అన్న ప్రసాదాల దిట్టంను తగ్గించారు. అయితే ఆలయ అర్చకులు, ఆగమ పండితులతో టీటీడీ ఈవో జె. శ్యామలరావు ఇటీవల సమావేశమయ్యారు. శ్రీవారి ఆలయానికి సంబంధించిన ఆచార వ్యవహారాలు, వైఖానస ఆగమోపచారాలు, పలు అంశాలపై వారితో చర్చించారు. ఈ సందర్భంగానే కరోనా సమయంలో తగ్గించిన ప్రసాదం దిట్టంను పెంచాలని వారు సూచించారు. ఈ నేపథ్యంలోనే అన్న ప్రసాద దిట్టంను పెంచాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది.
మరోవైపు టీటీడీ ఈవోతో జరిగిన సమీక్షా సమావేశంలో ఆలయ అర్చకులు, పండితులు పలు సూచనలు చేశారు, ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలోని వేద విద్యార్థులకు అప్రెంటీస్‌గా అవకాశం కల్పించాలని కోరారు. అలాగే ప్రతి సోమవారం ఆర్జిత సేవగా నిర్వహించే విశేష సేవను.. ఏడాదిలో ఒక్కసారైనా నిర్వహించాలని టీటీడీ ఈవోను కోరారు. అంతకుముందు తిరుమలలో పారిశుద్ధ్యంపైనా టీటీడీ ఈవో సమీక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో సమర్థవంతంగా పనిచేయాలని ఆదేశించారు.