చిన్నారిపై హత్యాచారం కేసులో దోషిగా తేలిన వ్యక్తికి పోక్సో కోర్టు మరణశిక్ష విధించగా.. ఉన్నత న్యాయస్థానం విచిత్రమైన కారణంతో దానిని జీవిత ఖైదుగా మార్చింది. రోజూ అతడు దేవుడ్ని చాలాసార్లు ప్రార్ధిస్తున్నాడని, భగవంతుడి ముందు లొంగిపోయాడని అందుకే శిక్షను తగ్గిస్తున్నామని న్యాయమూర్తి వ్యాఖ్యానించడం గమనార్హం. విస్మయానికి గురిచేసే ఈ తీర్పును ఒడిశా హైకోర్టు ఇటీవల వెలువరించింది. కేసు వివరాల్లోకి వెళ్తే.. జగత్‌సింగ్‌పుర్ జిల్లాలో 2014 ఆగస్టు 21 ఓ ఆరేళ్ల చిన్నారిని కామాంధులు అపహరించి అత్యాచారం చేసి చంపేశారు. తన అన్నతో కలిసి దుకాణానికి వెళ్లి చాక్లెట్లు కొనుక్కుని వస్తున్న చిన్నారిని కిడ్నాప్ చేశారు.
ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. చిన్నారిని ఎస్‌కే ఆసిఫ్ అలీ, ఎస్కే అబిద్ అలీతో కలిసి ఎత్తుకెళ్లి హత్యాచారం చేసినట్టు గుర్తించారు. అందుకు సంబంధించిన ఆధారాలను సేకరించి, కోర్టుకు సమర్పించారు. దీంతో అతడ్ని దోషిగా నిర్దారించిన జగత్‌సింగ్‌పుర్ పోక్సో కోర్టు.. మరణశిక్ష విధించింది. అభంశుభం తెలియని చిన్నారిని అతి కిరాతకంగా చంపేసిన అతడికి ఉరే సరైందని తీర్పు వెల్లడించింది. మరో నిందితుడ్ని అబిద్ అలీని నిర్దోషిగా విడుదల చేసింది. ఈ తీర్పును ఒడిశా హైకోర్టులో సవాల్ చేయడంతో.. జస్టిస్ ఎస్కే సాహూ, జస్టిస్ ఆర్కే పట్నాయక్ ధర్మాసనం విచారించింది.
ఈ పిటిషన్‌ై జూన్ 27న తీర్పు వెలువరించిన ధర్మాసనం... కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘చిన్నారిపై హత్యాచారం కేసులో దోషిగా నిర్దారణ అయిన ఆసిఫ్ అలీ రోజూ దేవుడ్ని ప్రార్థిస్తున్నాడు.. అతడు భగవంతుడి ముందు లొంగిపోయాడు... చేసిన నేరాన్ని ఒప్పుకోడానికి అతడు సిద్ధంగా ఉన్నాడు.. జైలులో అతడి ప్రవర్తనలో మార్పు వచ్చింది.. అందుకే పోక్సో కోర్టు అతడికి విధించిన మరణశిక్షను జీవితఖైదుగా మారుస్తున్నాం’’ అని తీర్పు సమయంలో ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే, బాధిత కుటుంబానికి రూ.1.50 లక్షల పరిహారం చెల్లించాలని పోక్సో కోర్టు ఆదేశించగా.. దాన్ని సవరించింది. ఆ మొత్తాన్ని రూ.10 లక్షలు పెంచిన హైకోర్టు.. పరిహారాన్ని వారికి అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది.