డ్వాక్రా మహిళల నిధులు కాజేసిన అధికారులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం అనకాపల్లి స్థానిక డీఆర్‌డీఏ కార్యాలయం ఎదుట డ్వాక్రా మహిళలు ధర్నా చేశారు. మండలంలోని సత్యనారాయణపురం, కొత్తూరు, మూలపేట పంచాయతీల్లో నకిలీ డ్వాక్రా గ్రూపులను ఏర్పాటు చేసి బ్యాంకు రుణాలను కాజేసిన వెలుగు, బ్యాంకు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. సీపీఎం, ఐద్వా ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో సీపీఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం మాట్లాడుతూ సంఘటన జరిగి ఆరు నెలలు అయిందని, అయినప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఎనిమిది కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. దోషులను కఠినంగా శిక్షించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. సీపీఎం మండల కన్వీనర్ గంటా శ్రీరామ్ మాట్లాడుతూ సత్యనారాయణపురం, కొత్తూరు పంచాయతీల్లో వీవోఏ గ్రూపు సభ్యులకు తెలియకుండానే నకిలీ గ్రూపులను ఏర్పాటు చేసి రూ.ఎనిమిది కోట్ల రూపాయలకు అవినీతికి పాల్పడ్డారన్నారు. ఐద్వా జిల్లా కార్యదర్శి డీడీ వరలక్ష్మి మాట్లాడుతూ ఇంత పెద్ద అవినీతి వ్యవహారం జరుగుతున్నా దీనిని పర్యవేక్షించాల్సిన మండల ఏపీఎం, సీసీలు సిబ్బందిని సస్పెండ్ చేసి చేతులు దులుపుకుందని ఆరోపించారు. ఈ ధర్నాలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రుత్తల శంకరరావు, డ్వాక్రా మహిళలు జి. సుభాషిణి, నాగమణి, ఉప్మాక లక్ష్మి, బోడి ఝాన్సీ, బొబ్బిలి గాయిత్రి తదితరులు పాల్గొన్నారు.