విద్యార్థులకు సైన్స్ పాఠ్యాంశాలు, ప్రయోగాలవైపు ఆసక్తి పెంపొందించడం, వారిని బాల శాస్త్రవేత్తలుగా ప్రోత్సహించే లక్ష్యంలో భాగంగా ఏర్పాటైన జీఎంసీ.బాలయోగి సైన్స్ మ్యూజియం కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు ఉద్దేశించిన ఏలూరు జిల్లా సైన్స్ ఆఫీసర్ భర్తీ ఉపాధ్యాయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ పోస్టు దక్కించుకునేందుకు పలువురు ఉపాధ్యాయులు లాబీయింగ్ చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు నియామాకానికి డీఈవో ఆధ్వర్యంలో కమిటి కూడా ఏర్పాటు కానున్నట్లు తెలుస్తోంది. రెండు దశాబ్దాలకుపైగా చరిత్రవున్న సైన్స్ మ్యూజియం రాష్ట్ర, జాతీయస్థాయిలో పలు సదస్సులు, టీచర్లకు శిక్షణ కార్యక్రమాలు, విజ్ఞానంకోసం విద్యార్థుల సందర్శనలతో కొన్నేళ్లపాటు అలరించింది. 2019నుంచి ఏ కార్యక్రమంలేక దాదాపుగా నిర్వీర్యమయ్యే దుస్థితికి చేరింది. జిల్లావ్యాప్తంగా విద్యార్థులను మ్యూజియంకు తరలించే బస్సు ఏనాడో నిలిచిపోయింది. ఇన్‌స్పైర్ ఎగ్జిబిషన్లు, సైన్స్ ప్రదర్శనలకే డీఎస్‌వో విధులు పరిమితమయ్యాయి. ఇవి మినహా మిగతా ఎటువంటి కార్యకలాపాలు లేని సైన్స్ మ్యూజియంను పర్యవేక్షించేందుకు తాజాగా జిల్లా సైన్స్ ఆఫీసర్ (డీఎస్‌వో) పోస్టును భర్తీచేయాలని జిల్లా విద్యాశాఖ ఇటీవల బహిరంగ ప్రకటన ఇచ్చింది. ఇప్పటివరకు జిల్లా సైన్స్ ఆఫీసర్‌గా అదనపు బాధ్యతలపై విధులు నిర్వర్తించిన ఉపాధ్యాయుడు ఇటీవల ఉద్యోగ విరమణచేయడంతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేయడానికి నిర్ణయించారు. ఈ నేపథ్యంలో సైన్స్ మ్యూజియంలో పలు భవనాలు మరమ్మతులకు గురికాగా, వీటి రిపేర్లనిమిత్తం రూ.40 లక్షలు సమగ్రశిక్ష జిల్లా ప్రాజెక్టు నుంచి విడుదల కావడంతోనే జిల్లా సైన్స్ ఆఫీసర్ పోస్టు భర్తీకి మంచి గిరాకీ ఏర్పడిందన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ నిధుల వినియోగంపై విస్తృత చర్చలు జరుగుతుండగా, కొత్తగా బాధ్యతలు తీసుకోనున్న జిల్లా సైన్స్ ఆఫీసర్‌కు ప్రభుత్వ నిధులు సద్వినియోగం చేయడానికి బాధ్యత తీసుకోవడం సవాల్‌గా భావిస్తున్నారు. ఇప్పటికే ఈ పోస్టుకోసం కన్నేసిన కొందరు తమకు అర్హతలు లేవని తెలిసినా ఎవరికివారు లాబీయింగ్‌తో డీఎస్‌వో పోస్టు దక్కించుకునేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తుండడం గమనార్హం. ఈ క్రమంలో డీఎస్‌వో ఉద్యోగ ఖాళీని భర్తీని ప్రభుత్వ నిబందనలమేరకు పారదర్శకంగా చేపట్టేందుకు డీఈవో అబ్రహం నేతృత్వంలో డీవైఈవో, ఎంఈవోలు, హెచ్‌ఎంలతో కూడిన కమిటీ ద్వారా జరిపించాలని నిర్ణయించి నట్టు సమాచారం. అలాగే రూ.40లక్షల నిధుల వినియోగానికి కూడా ఇంజనీరింగ్ నిపుణులు, విద్యాశాఖ అధికారులతో కూడిన కమిటీ పర్యవేక్షణ తప్పనిసరి చేయాలని భావిస్తున్నారు. మరోవైపు కాలక్షేపానికి సైన్స్ మ్యూజియంలో ఉద్యోగంలా కాకుండా, నిర్ణీత లక్ష్యసాధన కోసం నిరంతరం శ్రమించే ఉపాధ్యాయులకే అవకాశం ఇవ్వడంవల్ల ప్రయోజనకరంగా ఉంటుందని విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయి. కాగా ఈ నెల ఐదో తేదీతో డీఎస్‌వో పోస్టు భర్తీకి దరఖాస్తు గడువు ముగియనుండగా, ఆ తర్వాత రెండు రోజుల వ్యవధిలోనే నియామకం పూర్తిచేయడానికి విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.
![]() |
![]() |