యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పరిశ్రమలతో కలిసి పనిచేయాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. నైపుణ్యాభివృద్ధిపై గురువారం సచివాలయంలో ఆయన సమీక్షించారు. ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజీలను పరిశ్రమలతో అనుసంధానించి ఉపాధి అవకాశాలు మెరుగుపర్చాలన్నారు. ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజీలను స్థానికంగా ఉన్న దేశీయ, విదేశీ పరిశ్రమలతో అనుసంధానం చేసి, విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. అమరావతిలో నేషనల్ అకాడమీ ఆఫ్ కనస్ట్రక్షన్ సెంటర్, మంగళగిరిలో జెమ్స్ అండ్ జ్యూయలరీ ట్రైనింగ్ సెంటర్ నెలకొల్పేందుకు సర్వే నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి అవకాశాలను పెంచేందుకు విభాగాల వారీగా ప్రణాళికలు ఇవ్వాలన్నారు. విదేశాల్లో ఉపాధి కల్పనపై కేరళ రాష్ట్ర విధానాలను అధ్యయనం చేయాలన్నారు.