ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ఈ క్రమంలోనే ఏపీలోని మెడికల్ సెక్టార్‌కు ఊతమిచ్చేలా మరో మెడ్ టెక్ కంపెనీ ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. అబుదాబికి చెందిన M42 కంపెనీ ఏపీ ప్రభుత్వంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ విషయాన్ని ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. అబుదాబికి చెందిన ఎం42 కంపెనీ త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకోనుందని సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఒప్పందం ప్రకారం మూడు ఎకనమిక్ కారిడార్లలో పెట్టుబడులు, తొమ్మిది మున్సిపాలిటీలలో హెల్త్ హబ్స్ నిర్మాణం, అమరావతి హెల్త్ సిటీలో పెట్టుబడులకు అవకాశం ఉంది. పెట్టుబడులకు సంబంధించి మంత్రి సత్యకుమార్‌తో ఎం42 కంపెనీ ప్రతినిధులు ఇటీవలే సమావేశమై చర్చలు జరిపారు.
మరోవైపు పెట్టుబడులు పెట్టేందుకు ఏపీలో అపారమైన అవకాశాలు, వనరులు ఉన్నాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ అభిప్రాయపడ్డారు. ఏపీలో బల్క్ డ్రగ్ పార్క్ ఉందని.. అలాగే 170 ఎకరాల్లో ఉన్న మెడ్ టెక్ జోన్ కారణంగా పెట్టుబడులు పెట్టేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు మంత్రి చెప్పారు. ఎం42 సంస్థకు జినోమిక్స్, బయోటెక్, మెడ్ టెక్ విభాగాల్లో అనుభవం ఉన్నట్లు తెలిపారు. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే సంస్థలకు పూర్తి సహాయం అందిస్తామన్న మంత్రి.. ఈ సంస్థలకు అనుమతి ఇచ్చేందుకు సింగిల్ విండో విధానం అమలు చేస్తామన్నారు. ఎకనమిక్ కారిడార్లలలో సంస్థ ప్రతినిధులు పర్యటించిన తర్వాత.. వారితో చర్చించి అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటామని చెప్పారు.
మరోవైపు ఏపీలో అధికార పగ్గాలు చేపట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం.. రాష్ట్రానికి పెద్దఎత్తున పరిశ్రమలు తీసుకురావాలనే పట్టుదలతో ఉంది. ఎన్నికల సమయంలో సంక్షేమంతో పాటుగా అభివృద్ధి చేస్తామని.. సంపద సృష్టించి, ఆ సంపదను పేద ప్రజలకు సంక్షేమం రూపంలో అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా ఏపీ ప్రభుత్వం పనిచేస్తోంది. ఇప్పటికే శ్రీసిటీలోని వెర్మీరియన్ కంపెనీ వంద కోట్లతో విస్తరణకు సిద్ధమైంది. ఇప్పుడు దుబాయ్‌కి చెందిన ఎం42 కంపెనీ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది.