ఒకప్పుడు.. నడివీధుల్లో అలా కదలివస్తుంటే.. వాహనాలన్నీ తప్పుకునే పరిస్థితి. రోడ్డు మీద రయ్యి మని పరుగులు తీస్తుంటే.. కళ్లు పెద్దవి చేసి చూసే స్థితి. కానీ ఇప్పుడు.. ఏవీ నాటి వైభోగముల్.. ఏవీ నాటి కళాకాంతులు.. ఆర్భాటంగా మొదలై.. అలంకారప్రాయంగా మారి.. ఇప్పుడు చెత్త వాహనాల పక్కన గమ్మున నిల్చున్న పరిస్థితి. ఇదీ తిరుపతిలోని రెండు అంతస్థుల బస్సు కథ..కలియుగ ప్రత్యక్షదైవం ఆ శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు నిత్యం వేలాదిమంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. అలా వచ్చే భక్తులతో ఎగువన ఉన్న తిరుమల మాత్రమే కాకుండా కొండకింద ఉన్న తిరుపతి కూడా ఎల్లప్పుడూ కిటకిటలాడుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక నగరం తిరుపతితో పాటుగా చుట్టు్పక్కల ఉన్న దర్శనీయ స్థలాలను సందర్శించేందుకు భక్తులు ఒకట్రెండు రోజులు తిరుపతిలోనే బస చేస్తుంటారు. అలా వచ్చే శ్రీవారి భక్తులకు తిరుమల, తిరుపతి అందాలు చూపించడంతో పాటుగా స్థానికులకు ఉపయోగపడాలని గతంలో డబుల్ డెక్కర్ బస్సును తీసుకువచ్చారు. గతేడాది ఆర్భాటంగా ప్రారంభించారు. అయితే ఆర్భాటంగా ప్రారంభమైన డబుల్ డెక్కర్ బస్సు.. అలంకార ప్రాయంగా మారింది. ప్రస్తుతం చెత్తవాహనాల పక్కన చేరింది.
2023 అక్టోబర్‌లో అప్పటి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి.. ఈ డబుల్ డెక్కర్ బస్సును ప్రారంభించారు. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ నిధులతో రూ.2.35 కోట్లు వెచ్చించి ఈ బస్సును తీసుకువచ్చారు. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 250 కిలోమీటర్లు నడిచే ఈ డబుల్ డెక్కర్ బస్సులో 65 మంది ఒకేసారి ప్రయాణం చేయవచ్చు. అలాగే తిరుపతిలో ఈ బస్సు అందుబాటులోకి రావటంతో మరో అరుదైన గౌరవం ఆధ్యాత్మిక నగరానికి దక్కింది. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు తర్వాత డబుల్ డెక్కర్ బస్సు అందుబాటులోకి వచ్చిన నగరంగా తిరుపతి నిలిచింది.
అయితే ప్రారంభించిన తర్వాత తొలుత కొన్నిరోజుల పాటు ఉచితంగా నడిపిన తుడా అధికారులు.. ఆ తర్వాత ఆర్టీసీ ఆధ్వర్యంలో నడిపేందుకు యత్నించారు. అయితే ఆర్టీసీ అధికారులు అందుకు ఆసక్తి చూపకపోవటంతోసొంతంగానే నడుపుతూ వచ్చారు. మొదట రూ.50 ఛార్జీగా నిర్ణయించి నగరంలో తిప్పటం మొదలెట్టారు. అయితే డబుల్ డెక్కర్ బస్సుకు ప్రజల నుంచి ఆశించినంత స్పందన రాలేదు. దీనికి తోడు అనుమతులు లేవని రవాణాశాఖ అభ్యంతరం తెలపడంతో.. ప్రస్తుతం డబుల్ డెక్కర్ బస్సును తుడా అధికారులు మూలనపెట్టారు. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చెత్త వాహనాలను నిలిపే చోట.. ఈ బస్సును నిలిపి ఉంచారు.
సుమారుగా రెండున్నర కోట్లు ఖర్చు పెట్టి తెచ్చిన బస్సును అలా చెత్త వాహనాల పక్కన పడేయటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంత నిధులు ఖర్చుపెట్టి తీసుకువచ్చిన బస్సును ప్రజల కోసం అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు. టీటీడీతో మాట్లాడి ఈ బస్సును వారికి అప్పగిస్తే.. తిరుపతి రైల్వే స్టేషన్, బస్టాండ్ నుంచి శ్రీవారిమెట్టు వరకూ భక్తులను తరలించేందుకు వీలుగా ఉంటుందని సూచనలు ఇస్తున్నారు. మరి ఈ సలహాలను అధికారులు స్వీకరిస్తారా.. ఈ హైటెక్ బస్సుకు డంపింగ్ యార్డు నుంచి విముక్తి లభిస్తుందా చూడాలి మరి.