ప్రస్తుతం యువత అనుసరిస్తున్న లైఫ్ స్టైల్‌లో జంక్ ఫుడ్ అనేది భాగం అయిపోయింది. ఫాస్ట్‌ఫుడ్, పిజ్జాలు, బర్గర్లు ఇలా రకరకాల ఆహార పదార్థాలను ఆర్డర్ చేసుకుని ఎక్కడ ఉంటే అక్కడికే తెప్పించుకుని తింటూ ఉన్నారు. అయితే కొందరు అప్పుడప్పుడూ ఇలాంటి జంక్ ఫుడ్ తింటే.. కొందరు మాత్రం రోజూ అవే తింటూ ఉంటారు. ఇలా కొన్ని నెలల పాటు తిన్న ఓ యువతికి అరుదైన సమస్య వచ్చి పడింది. ఆమె పిత్తాశయంలో ఏకంగా 1500 రాళ్లు ఏర్పడ్డాయి. అయితే ఆమె తరచూ అస్వస్థతకు గురి కావడంతో ఓసారి డాక్టర్ వద్దకు వెళ్లి టెస్ట్‌లు చేయించుకోగా.. రాళ్ల సంగతి బయట పడింది. దీంతో ఆమెకు ఆపరేషన్ నిర్వహించిన డాక్టర్లు.. ఆ రాళ్లు అన్నింటినీ బయటికి తీశారు. జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల పిత్తాశయం క్యాన్సర్‌కు దారి తీయవచ్చని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఢిల్లీకి చెందిన 32 ఏళ్ల ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగినికి ఈ అరుదైన శస్త్ర చికిత్సను డాక్టర్లు నిర్వహించి.. విజయవంతంగా ఆమె పిత్తాశయంలోని రాళ్లను తొలగించారు. అయితే కొన్ని నెలలుగా ఆ యువతి నిత్యం జంక్ ఫుడ్ తినేది. కొన్ని నెలల పాటు ఆ యువతి అలా పిజ్జాలు, బర్గర్లు తినడంతో కడుపు ఉబ్బరం ప్రారంభం అయింది. అంతేకాకుండా ఆ యువతి బాగా బరువు పెరిగింది. ఆ తర్వాత తన సమస్య పరిష్కారంగా కొన్ని నెలల పాటు యాంటాసిడ్ మందులను.. డాక్టర్ సూచనలు లేకుండానే వేసుకుంది. దీంతో ఆ యువతికి వాంతులు, విరేచనాలు కావడం, పొత్తికడుపులో బాగా నొప్పి రావడం ప్రారంభం అయింది.
ఇక చేసేదేమీ లేక చివరికి ఆ యువతి డాక్టర్‌ను సంప్రదించింది. అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయాలని డాక్టర్ సూచించడంతో ఆమె చేయించుకుంది. అందులో వచ్చిన ఫలితాలను చూసి డాక్టర్ షాక్ అయ్యాడు. ఆమె గాల్ బ్లాడర్ (పిత్తాశయం) నిండా రాళ్లు ఉన్నట్లు గుర్తించాడు. దీంతో ఆమెకు మెరుగైన చికిత్స చేసేందుకు ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రికి ఆ డాక్టర్ రిఫర్ చేశాడు. దీంతో సర్ గంగారామ్ హాస్పిటల్ డాక్టర్లు.. యువతి పిత్తాశయంలోని రాళ్లను తొలగించడానికి ల్యాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ అనే అరుదైన ఆపరేషన్‌ను చేసి.. మొత్తం 1500 రాళ్లను బయటకు తీసి ఆ యువతి ప్రాణాలను రక్షించారు.
అయితే మహిళ పిత్తాశయం నుంచి 1500 రాళ్లను తొలగించిన డాక్టర్లు.. జంక్ ఫుడ్ తినడం వల్లే ఆ యువతికి ఇలా జరిగిందని తేల్చారు. ఈ క్రమంలోనే జంక్ ఫుడ్ తినడం వల్ల ఏర్పడే అనర్థాల గురించి డాక్టర్లు కీలక విషయాలను వెల్లడించారు. జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే పిత్తాశయంలో రాళ్లు ఏర్పడతాయని తెలిపారు. అంతేకాకుండా రెండు పూటలు తినడానికి మధ్య ఎక్కువ సమయం గ్యాప్ వచ్చినా.. ఎక్కువగా ఉపవాసాలు ఉన్నా ఈ ప్రమాదం వస్తుందని హెచ్చరించారు. ఇక రాళ్ల సైజు చిన్నగా ఉన్నప్పటికీ వాటి కారణంగా కామెర్లు, ప్యాంక్రియాటైటిస్ వంటివి వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుందని తెలిపారు. రాళ్లు చాలా కాలం పిత్తాశయంలో ఉంటే.. వాటికి సరైన చికిత్స చేయకుంటే పిత్తాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందని పేర్కొన్నారు.