ప్రస్తుతం దేశం మొత్తం భోలే బాబా పేరు బాగా వినిపిస్తోంది. ఆయన కాళ్ల కింద మట్టిని తీసుకునేందుకు జనం ఎగబడటంతో జరిగిన తొక్కిసలాటలో ఏకంగా 121 మంది మృత్యువాత పడటం మొత్తం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన తర్వాత భోలే బాబా లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా ఆయనకు రూ.100 కోట్ల ఆస్తులు ఉన్నాయంటూ వార్తలు రావడం పెను సంచలనంగా మారింది. దేశవ్యాప్తంగా అనేక ఆశ్రమాలు ఉన్నాయని.. ఆయన లగ్జరీ కార్లు కలిగి ఉన్నాడని.. నిత్యం హై సెక్యూరిటీ భోలే బాబా ఉంటారని వార్తలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. మరోవైపు.. ఈ వ్యవహారంలో పరారీలో ఉన్న భోలే బాబా ఆచూకీ ఇంకా పట్టుకోలేకపోవడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భోలే బాబాకు సంబంధించిన వ్యక్తిగత విషయాలపై మీడియా సంచలన విషయాలను బయటపెట్టింది. భోలే బాబాకు భారీగా ఆస్తులు ఉన్నాయని.. ఆయన విలాసాలకు సంబంధించి.. భోలే బాబా ఆశ్రమాల విశ్వసనీయ సమాచారాన్ని సేకరించి.. వెలుగులోకి తీసుకువచ్చింది. దేశవ్యాప్తంగా భోలే బాబాకు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఆశ్రమాలు ఉన్నట్లు గుర్తించింది. ఇందులో ఎక్కువగా ఉత్తర్‌ప్రదేశ్‌లోనే ఉన్నాయని పేర్కొంది. ఇక భోలే బాబాకు రూ.100 కోట్ల ఆస్తులు ఉన్నాయని.. ఆయన ఆశ్రమంలో ఉన్న విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో భోలే బాబాకు 24 గ్రాండ్ ఆశ్రమాలు ఉన్నాయని తెలుస్తోంది.
ఇక శ్రీ నారాయణ్ హరి సాకార్ ఛారిటబుల్ ట్రస్ట్ అనే పేరుతో ఈ ఆశ్రమాలన్నింటినీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ ట్రస్ట్ వ్యవహారాలు మొత్తం భోలే బాబాకు అత్యంత నమ్మకస్తులైన వారు చూస్తూ ఉంటారు. వైట్ కలర్ డ్రెస్, టై, కళ్లద్దాలతో దర్శనం ఇచ్చే భోలే బాబా.. ఆయన కోసం వచ్చిన వారిని కలిసేందుకు వచ్చే సమయంలో భారీ కాన్వాయ్‌తో వస్తారని తెలుస్తోంది. భోలే బాబా ప్రయాణించే కారుకు ముందు 16 మంది బాడీగార్డులు.. ఖరీదైన బైక్‌లపై వెళ్తూ.. ఆయన కారుకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూస్తారు. ఇక ఆయన కారు వెనకాల దాదాపు 30 కార్లతో భారీ కాన్వాయ్ ఉంటుంది. ఇక భోలే బాబా మాత్రం వైట్ టయోటా ఫార్చునర్ కారులో ఎప్పుడూ ప్రయాణం చేస్తారు. ఇక ఆ కారు లోపల మొత్తం పూర్తిగా వైట్ కలర్‌లో ఉంటుందని ఆయన అనుచరులు వెల్లడించారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మెయిన్‌పురిలోని హరి నగర్ అని పిలిచే ఆశ్రమంలో భోలే బాబా నివాసం ఉంటారు. ఈ హరి నగర్ 13 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఇందులో భోలే బాబా, ఆయన భార్య కోసం దాదాపు 6 లగ్జరీ రూమ్స్ ఉంటాయి. ఇక హరి నగర్ ఆశ్రమంలోకి వెళ్తుండగా ఆ ఆశ్రమానికి విరాళం ఇచ్చిన 200 మంది పేర్లు రాసి ఉంటాయి. అందులే రూ.10 వేల నుంచి రూ.2.5 లక్షల వరకు ఇచ్చిన దాతల పేర్లు ఉంటాయి. ఇక ప్రస్తుతం ఇటావాలో మరో కొత్త ఆశ్రమాన్ని నిర్మిస్తున్నారు.
ఇక ఈ తొక్కిసలాట ఘటనను ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. 121 మందిని పొట్టనపెట్టుకున్న ఘటనకు సంబంధించి ఇప్పటికే ఆరుగురిని అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటనకు ప్రధాన కారణం అయిన భోలే బాబా అలియాస్ సూరజ్‌పాల్ అలియాస్ నారాయణ్ సాకార్ హరి.. పరారీలో ఉండగా.. ఇప్పటికీ ఆచూకీ లభించలేదు. ఇక భోలే బాబాను ఈ కేసులో నిందితుడిగా చేర్చకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. మరోవైపు.. ఈ హత్రాస్ తొక్కిసలాట ఘటనపై జ్యుడిషియల్ విచారణ జరుపుతామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న భోలే బాబా దొరికితే ప్రశ్నిస్తామని అలీగఢ్ ఐజీ శాలభ్ మాథుర్ పేర్కొన్నారు.
హత్రాస్ తొక్కిసలాట దుర్ఘటనలో బాధితులుగా మారిన కుటుంబాలను కాంగ్రెస్ పార్టీ అగ్రనేత.. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శుక్రవారం పరామర్శించారు. అసలు తొక్కిసలాట ఎలా జరిగింది అనే విషయాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. అయితే హత్రాస్ తొక్కిసలాట ఘటనను రాజకీయం చేసే ఉద్దేశం తనకు లేదని చెప్పిన రాహుల్ గాంధీ.. బాధిత కుటుంబాలకు ధైర్యాన్ని ఇవ్వడం కోసమే అక్కడికి వెళ్లినట్లు తెలిపారు. అయితే సత్సంగ్ నిర్వహణలో అధికార వర్గాల లోపాలు ఉన్నాయని తెలుస్తోందని.. అంతమంది జనం వచ్చినపుడు సరిపడా భద్రత లేదని చెప్పారు.