2 దశాబ్దాల క్రితం ఇళ్ల కోసం కొన్న స్థలాలను కొంతమంది కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని, ఇందులో మాజీమంత్రి జోగి రమేశ్ అనుచరుల హస్తం ఉందని నగరంలోని 45వ డివిజన్ జోజినగర్ కరెంట్ ఆఫీసు రోడ్డులోని ఆర్టీసీ సుబ్బారావు ప్లాట్ల యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. రూ.లక్షల్లో వ్యయం చేసి ఇళ్ల నిర్మాణాల కోసం 2001లో షేక్ మజీద్ అనే వ్యక్తి వద్ద 2.17 ఎకరాలను 42 మంది కొన్నామని, ఇందులో 25మంది ఇళ్లు నిర్మించుకున్నారన్నారు. స్థలాలను కొన్నప్పుడు కనిపించనివారు ఇప్పుడు లక్ష్మీరామ కో–ఆపరేటివ్ సొసైటీ పేరుతో వచ్చి అక్రమాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.