మాడుగుల మండలంలోని తాటిపర్తి పంచాయతీ బిళ్లలపాలెం గ్రామ శివారులోని తాచేరు గెడ్డలో మునిగి ఆదివారం ఇద్దరు యువకులు మృతి చెందారు. దీనికి సంబం ధించి వివరాలు ఇలా వున్నాయి. తాటిపర్తికి చెందిన కురము చందు(25)కి విశాఖపట్నం ఆరిలోవకు చెందిన మేఘనతో గత నెలలో వివాహమైంది. అక్కడి జీవీఎంసీ పరిధిలో మలేరియా విభాగంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా చందు పనిచేస్తున్నాడు. ఆరిలోవలో నివాసముంటున్నారు. చందు స్వగ్రామమైన మాడుగుల మండలం తాటిపర్తికి భార్య మేఘన , ఆమె అన్న జ్ఞానేశ్వర్(22) వచ్చారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తాటిపర్తి గ్రామానికి పక్కనే ఉన్న బిళ్లలపాలెం గ్రామం సమీపాన గల తాచేరు గెడ్డ వద్దకు వెళ్లారు. చందు, జ్ఞానేశ్వర్లు నీటిలో సరదాగా స్నానం చేసేందుకు దిగారు. అయితే అక్కడ లోతు ఎక్కువగా ఉండడంతో ఇద్దరికీ ఈత రాకపోవడంతో మునిగిపోయారు. ఈ సంఘటన చూసిన మేఘన విలపిస్తూ బిళ్లలపాలెం గ్రామస్థులకు చెప్పడంతో వారందరూ సంఘటన స్థలానికి వెళ్లి వారిద్దరిని బయటకు తీశారు. అప్పటికే అపస్మారక స్థితికి చేరుకున్న వారిని మాడుగుల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరిశీలించి అప్పటికే వారు మృతి చెందినట్టు నిర్ధారించారు. వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.