ఉచిత ఇసుక విధానం జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి అమల్లోకి రానున్నది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ నాగలక్ష్మి వివిధ శాఖల అధికారులతో చర్చించిన అనంతరం స్టాక్‌పాయింట్ల వద్ద లారీలో ఇసుక లోడింగ్‌కు మెట్రిక్ టన్నుకు రూ.250గా ధర నిర్ణయించారు. ఇక ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. లారీ/ట్రాక్టర్/ఎద్దులబండికి సంబంధించిన రవాణా ఛార్జీలు వినియోగదారుడే భరించాల్సి ఉంటుంది. అక్రమాలను నిరోధించేందుకు పూర్తిగా డిజిటల్ చెల్లింపుల విధానాన్ని అమలు చేయనున్నారు. స్టాక్‌పాయింట్ల వద్ద ఎలాంటి నగదు లావాదేవీలు జరగవన్న విషయాన్ని వినియోగదారులు గుర్తించాల్సి ఉంటుంది. యూపీఐ ద్వారా నగదుని స్టాక్‌పాయింట్ వద్ద చెల్లిస్తే సరిపోతుంది.