ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడే వారిపై విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని విజయనగరం ఎస్పీ దీపిక పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా 44 ఫిర్యాదులు స్వీకరించారు. రాజాం నగరానికి చెందిన వ్యక్తి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.మూడు లక్షలు తీసుకున్నారని, నేటి వరకూ ఎటువంటి ఉద్యోగం కల్పించలేదని, డబ్బులు తిరిగి ఇవ్వలేదని, న్యాయం చేయాలని తెర్లాం మండలం డి.గదబవలసకు చెందిన వ్యక్తి కోరారు.తనకు ప్రైవేటు సంస్థలో ఉద్యోగం కల్పిస్తానని తోటపాలెంనకు చెందిన వ్యక్తి రెండు లక్షలు తీసుకున్నారని, నేటి వరకూ ఎటువంటి ఉద్యోగం కల్పించలేదని, తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వలేదని విజయనగరానికి చెందిన మహిళ ఫిర్యాదు చేశారు. తన భర్తతో ఉన్న వివాదాలను పరిష్కరిస్తానని రామవరానికి చెందిన వ్యక్తి రూ.20 వేలు తీసుకుని, వివాదం పరిష్కరించలేదని, ఎన్నిసార్లు అడిగినా, డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని, న్యాయం చేయాలని గంట్యాడ మండలం రామవరానికి చెందిన మహిళ ఎస్పీని కోరారు. ఈ ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించి, తీసుకున్న చర్యలను నివేదించాలని సంబంధిత పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్‌పీ ఆష్మాపరహీన్, డీఎస్పీ వీరకుమార్, సీఐలు విజయనాఽథ్, నర్సింహమూర్తి, మురళి తదితరులు పాల్గొన్నారు.