వైసీపీ ప్రభుత్వంలో టీడీఆర్ బాండ్లలో చాలా కుంభకోణాలు జరిగాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న సంచలన ఆరోపణలు చేశారు. వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి దోచుకున్నట్లు ఆధారాలు ఉన్నాయని హాట్ కామెంట్స్ చేశారు. ఈ కుంభకోణంపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఏపీ డీజీపీని కోరానని అన్నారు. ఈ స్కాంకు సంబంధించిన వివరాలను డీజీపీకి అందజేసినట్లు వివరించారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో బుద్దా వెంకన్న మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మాజీ సీఎం జగన్ రెడ్డి రూ. 42వేల కోట్లు దోచుకున్నారని ఆరోపణలు చేశారు. మళ్లీ జగన్ సీఎం అయ్యాక ఇసుక, గనులు, మద్యం, భూముల మీద దోపిడీ చేశారని మండిపడ్డారు. టీడీఆర్ బాండ్ల విషయంలో కూడా జగన్ కుంభకోణానికి పాల్పడ్డారని చెప్పారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ కొత్త మోసం వెలుగులోకి వచ్చిందని వివరించారు. ప్రభుత్వ స్థలం గజం రూ.2వేలు ఉన్న ప్రాంతంలో ఎకరాల చొప్పున వైసీపీ నేతలు కొనుగోలు చేశారని ఆరోపించారు. అక్కడ భూముల ధరలు పెంచే అవకాశం ప్రభుత్వానికి ఉంటుందని అన్నారు. కుట్రతో గజం రూ. 2 వేలు ఉన్న చోట గజం రూ. 30వేలు పెంచారని బుద్దా వెంకన్న ధ్వజమెత్తారు.