రాయలసీమ ప్రాంతంలోని ప్రాజెక్టులను వెంటనే పూర్తిచేసే దిశగా చర్యలు తీసుకోవాలని సాగు నీటి సాధన సమితి వ్యవ స్థాపకుడు బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు. సాగునీటి సాధనా సమితి ఆధ్వర్యంలో, రాయలసీమ స్థితిగతులు, రాయలసీమ నీటి అవగాహన, రాయలసీమ సమగ్ర అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా సోమవారం పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితను కలిసి నీటి అవగాహనపై రూపొందించిన పుస్తకాన్ని ఆమెకు అందజేశారు. రాయలసీమలోని నీటి ప్రాజెక్టుల పరిస్థితులను వివ రించారు. గత ప్రభుత్వంలో తీసుకున్న జీవో వివరాలు ఎమ్మెల్యేతో చర్చించి, ఆ జీవోల ద్వారా సీమ ప్రాంతానికి జరిగిన నష్టాన్ని క్లుప్తంగా వివరించారు. ఈ సందర్భంగా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతంలోని ప్రాజెక్టులకు గత ప్రభుత్వంలో చాలా నష్టం జరిగిందని, సీమకు జరిగిన నష్టాన్ని రాయలసీమలో ఉన్న ఎమ్మెల్యేలను, ఎంపీలను కలిసి తెలియజే స్తామని, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి సీమ సమస్యలను తీసుకుపోయే దశలో భాగంగా ఎమ్మెల్యేలను కలుస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాగునీటి సాధన సమితి నాయకులు వాడాల చంద్రశేఖర్‌రెడ్డి, సుధాకర్, ఏఆర్‌కే డేవిడ్, సభ్యులు పాల్గొన్నారు.