ఏపీలోని వాహనదారులకు గుడ్ న్యూస్. ఏపీలో అధికార పగ్గాలు చేపట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం పాలనలో ప్రక్షాళన చేపట్టింది. గత ప్రభుత్వంలో అనుసరించిన పలు విధానాలను టీడీపీ కూటమి ప్రభుత్వం మారుస్తోంది. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రవాణాశాఖ సేవలన్నీ ఒకచోటే, ఒక వెబ్ సైట్ ద్వారా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వాహన్ వెబ్ సైట్ ద్వారా అన్ని రకాల రవాణాశాఖ సేవలను అందించాలని అధికారులు నిర్ణయించారు. అందులో భాగంగా తొలుత ఎన్టీఆర్ జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా వాహన్ వెబ్ సైట్ సేవలను ప్రారంభించనున్నారు. లోటు పాట్లను గుర్తించి ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు తెలిసింది. ఎన్టీఆర్ జిల్లాలో వాహన్ వెబ్ సైట్ ద్వారా సేవలు విజయవంతమైతే.. ఏపీ రవాణాశాఖ అమలు చేస్తున్న ఈ- ప్రగతి సైట్ స్థానంలో వాహన్ వెబ్ సైట్ తేవాలని అధికారులు భావిస్తున్నారు.
మరోవైపు వాహన్ వెబ్ సైట్‌ను కేంద్రం ఐదేళ్ల కిందటే ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఒక్కో రాష్ట్రంలోని రవాణాశాఖకు ఒక్కో వెబ్ సైట్ ఉండటంతో.. ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వాహనాల డేటా సేకరణ, తనిఖీలలో ఇబ్బందులు ఎదురయ్యేవి. అలాగే ఆర్సీ పత్రాలు, ఫిట్‌నెస్ పత్రాలను ఆన్‌లైన్‌లో తనిఖీ చేయడం కూడా వీలయ్యేది కాదు. దీంతో ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు వాహనాల వెరిఫికేషన్ కుదరక జరిమానాలు చెల్లించాల్సి వచ్చేది. దీంతో ఈ సమస్యలను పుల్ స్టాప్ పెట్టేందుకు వాహనదారుల కోసం కేంద్రం ఒకే వెబ్ సైట్ తీసుకువచ్చింది. పరివాహన్ పేరుతో వెబ్ సైట్ తీసుకువచ్చిన కేంద్రం.. ఇందులోనే సమాచారం నిక్షిప్తం చేయాలని అప్పట్లో రాష్ట్రాలను ఆదేశించింది.
అన్ని రాష్ట్రాల తరహాలోనే ఏపీలో కూడా 2020 నుంచి వాహన్ వెబ్ సైట్ సేవలు ప్రారంభమయ్యాయి. అయితే ఆ తర్వాతి కాలంలో ప్రభుత్వం దీని గురించి పట్టించుకోలేదు. అధికారులు కూడా రాష్ట్రానికి చెందిన ఈ- ప్రగతి వెబ్ సైట్‌లోనే వివరాలు నమోదు చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో వాహన్ వెబ్ సైట్ సేవలను ఉపయోగించుకోవాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ఎన్టీఆర్ జిల్లాను ప్రయోగాత్మకంగా ఎంచుకుంది. ఇక్కడ విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా వాహన్ వెబ్ సైట్ ద్వారా సేవలు అందిస్తారు.