చంద్రబాబు తాను చేయని వాటిని తన గొప్పలుగా చెప్పుకున్నారని కాకాణి విమర్శించారు. ఇంధన రంగంపై చంద్రబాబు ప్రజెంటేషన్ పూర్తిగా అసత్యాలమయం అన్నారు. సంస్కరణలకు ఆద్యుడు అన్నట్టుగా చంద్రబాబు చెప్పుకున్నారన్నారు. ప్రజలకు విద్యుత్ పంపిణీ గురించి తెలియజేయడం కన్నా వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి పనిగట్టుకుని ప్రజెంటేషన్ ఇచ్చారన్నారు. 2014-15 చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పడు 59,198 మిలియన్ యూనిట్లు సంవత్సరానికి అవసరం ఉండేదన్నారు. 2018-19 అంటే చంద్రబాబు దిగిపోయేనాటికి 63,675 మిలియన్ యూనిట్లకు డిమాండ్ పెరిగిందన్నారు. కేవలం సగటున 1.9 శాతం వృద్ధి రేటు ఉందన్నారు. కొత్త కనెక్షన్లు ఇవ్వలేదన్నారు. డిమాండ్ పెరగకుండా ఆయన మేనేజ్ చేస్తూ వచ్చారన్నారు. జాతీయ సగటు వృద్ధి రేటు 4.5 శాతం ఉందని, జాతీయ వృద్ధి రేటులో దాదాపు మూడో వంతుకు ఆంధ్ర రాష్ట్రం పడిపోయిందన్నారు. 2014-19 మధ్యలో వినియోగం దాదాపుగా 36 శాతం పెరిగిందని కాకిలెక్కలు కట్టి చంద్రబాబు డబ్బా కొట్టుకున్నారన్నారు. మొత్తం తీసుకున్నా 7.6 శాతానికి పరిమితమయ్యందని గుర్తు చేశారు. అదే వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత దాదాపుగా 25 శాతం డిమాండ్ పెరిగినట్లు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ రిపోర్టు ఇచ్చిందన్నారు. ఇది వాస్తవమా? కాదా? అని ఆయన ప్రశ్నించారు.