ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, చింతూరు పరిధిలోని మోతుగూడెం పోలీసులు రూ. 40 లక్షల విలువైన 800 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు బుధవారం విలేకరుల సమావేశంలో చింతూరు ఏఎస్పీ రాహుల్‌మీనా వివరాలు వెల్లడించారు. రెండు వేర్వేరు ఘటనలలో మొత్తం 800 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్టు ఏఎస్పీ రాహుల్ మీనా తెలిపారు. మధ్యప్రదేశ్‌కు చెందిన అమిత్‌గిరి, శివదయాల్, అలోక్ గోతం, రంజిత్‌మావై, దుర్గేశ్‌గోస్వామి ఒక ముఠాగా ఏర్పడ్డారు. అనంతరం ఈ ఐదుగురు ఒడిసా రాష్ట్రం, మల్కానగిరి జిల్లా అల్లూరికోటకు చెందిన సంజీవ్ అలియాస్ గెన్ను వద్ద 550 కిలోల గంజాయి కొనుగోలు చేశారు. అనంతరం గంజాయిని అల్లూరి సీతారామరాజు జిల్లా మోతుగూడెం పోలీసు స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతానికి తరలించారు. అక్కడ నుంచి మధ్యప్రదేశ్‌కు తరలించే క్రమంలో ఐచర్ వ్యాన్‌లో లోడ్ చేశారు. సమాచారం అందుకున్న మోతుగూడెం పోలీసులు కాపు కాచి ఐచర్ వ్యాన్‌తో పాటు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కాగా మధ్యప్రదేశ్‌కు చెందిన రంజిత్‌మావై, దుర్గేశ్‌గోస్వామిలతో పాటు ఒడిసాకు చెందిన సంజీవ్ పరారీలో ఉన్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం, సుక్మా జిల్లా, కుంటకు చెందిన మజ్జి వెంకట్ సమంత్, తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకకు చెందిన సతీష్‌రెడ్డి, వరంగల్ జిల్లా జనగాంకు చెందిన యరవ వివేక్ డొంకరాయి పోలీసు స్టేషను పరిధిలోని మంగంపాడు నుంచి హైదరాబాద్‌కు కారులో 250 కిలోల గంజాయి తరలించే ప్రయత్నం చేశారు. మోతుగూడెం పోలీసులు కాపు కాచి కారుతో పాటు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ ఘటనలో సతీష్‌రెడ్డి, యరవ వివేక్ పరారీలో ఉన్నట్లు ఏఎస్పీ తెలిపారు. గంజాయి స్మగ్లింగ్ విషయంలో పోలీసు శాఖ కఠినంగా వ్యవహరిస్తోందన్నారు. తెలిసో తెలియకో వాహనాలను అద్దెకు ఇవ్వడం కూడా నేరమేనని ఏఎస్పీ చెప్పారు. వాహనాలను అద్దెకు ఇచ్చే సమయంలో సంబంధిత వాహన యజమానులు విధిగా పూర్తి వివరాలు తీసుకొని అద్దెకు ఇవ్వాలని ఏఎస్పీ సూచించారు. చింతూరు డివిజన్ పరిధిలో పోలీసు చెక్‌పోస్టులు పకడ్బంధీగా ఏర్పాటు చేశారని, ఇకపై గంజాయి తరలింపు అనేది ఈ దిశగా అసాధ్యమని ఏఎస్పీ చెప్పారు. కార్యక్రమంలో చింతూరు సీఐ గజేంద్రకుమార్, మోతుగూడెం ఎస్‌ఐ జి.గోపాలరావు సిబ్బంది పాల్గొన్నారు.