ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆధార్‌కార్డు ఉంటే ఇసుక ఇస్తున్నారు. ఈ విధానంలో ట్రాక్టర్ లేదా రెండు మూడు యూనిట్ల లారీలు సైతం అవకాశం కలుగుతుంది. చిన్నతరహా వినియోగాలకు కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది.తూర్పుగోదావరి జిల్లాలో గృహ నిర్మాణాలకు అప్రూవ్డ్ ప్లాన్ ఉంటేనే ఇసుక ఇచ్చే విధానం అమలు చేయడంతో కొనుగోలుదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరుగుదొడ్లు నిర్మాణం, ప్రహరీ గోడలు, చిన్నతరహా నిర్మాణాలకు అప్రూవడ్డ్ ప్లాన్‌లు ఉండవు. ఇలాంటి వారంతా ఇసుక కొనుగోలుకు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విధానం అమలై పేద వర్గాలకు ఇసుక అందదని అంటున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలందరికి ఇసుకను ఉచితంగా ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం అమలులో సాధ్యం కావడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం సంబంధిత అధికారుల అవగాహన లోపమేనని తెలుస్తున్నది. ఉచిత ఇసుక పేదలకు అందేలా చూడాలని ఇసుకాసురులు రెచ్చిపోకుండా కట్టడి చేయాలని పలువురు సూచిస్తున్నారు.