ఏపీ రాజకీయాలంటే మాటల తూటాలు, వ్యక్తిగత దూషణలు, అరెస్టులు ఇవే గుర్తుకువస్తాయి. కానీ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారో టీడీపీ ఎమ్మెల్యే. ప్రత్యర్థి ఇంటికి స్వయంగా వెళ్లి ఆయనతో మాటలు కలిపారు. యోగక్షేమాలు అడిగి కనుక్కోవటంతో పాటుగా.. తాజా రాజకీయ పరిస్థితులపైనా చర్చించారు. ఇలాంటి అరుదైన సన్నివేశానికి వేదికగా మారింది ఉమ్మడి అనంతపురం జిల్లా. మడకశిర నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి ఇంటికి వెళ్లారు. మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు.. శుక్రవారం ఈర లక్కప్ప నివాసానికి వెళ్లారు. ఆయనను పలకరించారు. ఇంటికి వచ్చిన ప్రత్యర్థిని ఈర లక్కప్ప సైతం సాదరంగా ఆహ్వానించారు. ఇద్దరూ కలిసి కూర్చుని తాజా రాజకీయాల గురించి మాట్లాడుకున్నారు.
అనంతరం రాజకీయాలు కేవలం ఎన్నికలప్పుడు మాత్రమేనని, ఆ తర్వాత ప్రజల కోసం పనిచేయాలని ఇద్దరు నేతలు అభిప్రాయపడ్డారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. రాజకీయాల్లో ఇలాంటి సానుకూల వాతావరణం ఉండాలని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు గతంలో సర్పంచ్‌గా పనిచేసిన ఈర లక్కప్పను 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మడకశిర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్ జగన్ బరిలోకి దింపారు. సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి స్థాయికి ఎదిగిన ఈర లక్కప్ప.. ఈ ఎన్నికల్లో గట్టిపోటీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కూటమి వేవ్ సాగిన 2024 ఎన్నికల్లో మడకశిరలో ఈర లక్కప్ప టీడీపీకి గట్టిపోటీ ఇచ్చారు. చివరకు 350 ఓట్ల స్వల్ప మెజారిటీతో ఈర లక్కప్ప మీద టీడీపీ అభ్యర్థి ఎమ్మెస్ రాజు విజయం సాధించారు. తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
అయితే టీడీపీ, వైసీపీ మధ్య ఇంత హోరాహోరీ పోరు ఉన్న నియోజకవర్గంలో ఇద్దరు ప్రత్యర్థులు కలిసి కూర్చుని మాట్లాడుకోవటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎమ్మెస్ రాజు.. పాత రాజకీయాలను పక్కనబెట్టి.. వైసీపీ అభ్యర్థి ఇంటికి వెళ్లడం, ఈర లక్కప్ప కూడా సాదరంగా ఆహ్వానించడం ఇప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. టీడీపీ, వైసీపీ అంటే ఉప్పూనిప్పుగా ఉండే పరిస్థితుల్లో ఇలా సానుకూలంగా, సుహృద్భావంగా మెలగడం రాజకీయవర్గాలను సైతం విస్మయపరిచింది. ఏదేమైనా ఇద్దరు నేతలు ఇలాగే పరస్పర సహకారంతో మడకశిర నియోజకవర్గ అభివృద్ధికి పనిచేయాలని మడకశిర ప్రజలు కోరుకుంటున్నారు.