శ్రీసత్యసాయి జిల్లా, చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలో దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. జెడ్పీటీసీ సభ్యుడు గోవిందరెడ్డి, మండలంలోని అన్ని గ్రామాల వైయస్ఆర్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు చెన్నేకొత్తపల్లి చేరుకుని వైయస్ఆర్ విగ్రహం వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఐ వెంకటేశ్వర్లు నిరసన తెలుపుతున్న వారివద్దకు చేరుకుని.. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పోలీస్స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లి సీఐ శివాంజనేయులుకు ఫిర్యాదు చేశారు. దుండగులు ధ్వంసం చేసిన వైయస్ఆర్ విగ్రహం స్థానంలో ఒకటిరెండు రోజుల్లో నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని నాయకులు తెలిపారు.