జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి సంబంధించిన కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ చట్టాన్ని సవరించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.. లెఫ్టినెంట్ గవర్నర్‌కు మరిన్ని అధికారాలు కట్టబెట్టింది. త్వరలో జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పునర్వ్యవస్థీకరణ చట్టం 2019 అధికారాలను అమలు చేసే సెక్షన్ 55 నిబంధనలకు కేంద్ర హోం శాఖ చేసిన సవరణలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. దీంతో జులై 12న గెజిట్ విడుదల కావడంతో ఈ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ (ఎంహెచ్) నోటిఫికేషన్ పేర్కొంది.
జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వ వ్యాపార లావాదేవీల సవరణకు రాష్ట్రపతి మరిన్ని నిబంధనలను రూపొందించినట్లు ఈ నోటిఫికేషన్ వెల్లడించింది. తాజాగా, సవరించిన చట్టాన్ని జమ్మూ కశ్మీర్ (రెండో సవరణ)- నియమాలు 2024 అని పిలవాలని ఎంహెచ్ నోటిఫికేషన్ తెలిపింది. తాజా సవరణలతో శాంతి భద్రతలకు సంబంధించి పూర్తి అధికారాలు లెఫ్టినెంట్ గవర్నర్‌కు దఖలుపడ్డట్టయ్యింది. దీనికి ముందు పోలీస్, శాంతి భద్రతలు, అఖిల భారత సర్వీసులు, ఏసీబీకు సంబంధించి విచక్షణను అమలు చేయడానికి ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉండేది.
కానీ సవరించిన చట్ట నియమాల్లోని సబ్ రూల్ (2ఎ) ప్రకారం.. ఆర్థికశాఖ సమ్మతి అవసరం లేదు. వీటికి సంబంధించిన ప్రతిపానదలను లెఫ్టినెంట్ గవర్నర్ ముందు ప్రధాన కార్యదర్శి ఉంచితే.. ఆయన ఆమోదించడం లేదా వాటిని తిరస్కరించే అవకాశం ఉంది. 2019 చట్టంలోని ప్రధాన నియమాల్లో 42 తర్వాత.. కొత్తగా 42(ఎ)ను చేర్చింది. ఈ నిబంధన ప్రకారం.. రాష్ట్ర ముఖ్యమంత్రికి న్యాయ వ్యవహారాల్లో ఎలాంటి అధికారం ఉండదు. అడ్వకేట్ జనరల్ (ఏజీ) సహా ఇతర న్యాయ అధికారుల నియమకానికి ప్రధాన కార్యదర్శి, లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం తప్పనిసరి.
ఇక 42 (బి) ప్రకారం.. ప్రాసిక్యూషన్ లేదా అప్పీల్‌కు సంబంధించిన ఏదైనా ప్రతిపాదనను న్యాయశాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ద్వారా ప్రధాన కార్యదర్శి.. లెఫ్టినెంట్ గవర్నర్ ముందు ఉంచుతారు. 43 నిబంధన కూడా జైళ్లు, డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్, ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలకు సంబంధించిన అంశాలపై కొన్ని నిబంధనలు చేర్చుతామని గెజిట్ నోటిఫికేషన్‌లో ఎంహెచ్ఏ పేర్కొంది. అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలు, అఖిల భారత సర్వీస్ క్యాడర్ అధికారుల పోస్టింగ్, బదీలీలకు సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్‌కు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, జీఏడీ ప్రధాన కార్యదర్శి ద్వారా ప్రతిపాదనను పంపాలి. ఇక, 2019 ఆగస్టు 5న జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ను కేంద్రం రద్దు చేసిన విషయం తెలిసిందే.