ఉత్తర్ ప్రదేశ్‌లో ఓ వ్యక్తిపై పాము పగబట్టి.. ప్రతి శనివారం కాటు వేస్తోంది. ఫతేపూర్‌కు చెందిన వికాస్ దూబే (24) అనే యువకుడు గత 40 రోజుల్లో ఏడుసార్లు పాము కాటుకు గురయ్యాడు. ప్రతిసారీ కాటువేయడం.. అతడు ఆస్పత్రికి వచ్చి వైద్యం చేయించుకోవడం షరా మామూలుగా మారింది. ఈ వ్యవహారంపై స్థానిక చీఫ్ మెడికల్ ఆఫీసర్ రాజీవ్ న్యాయ్ గిరి మాట్లాడుతూ.. ఆర్ధిక సాయం చేయాలని అధికారులను బాధితుడు అభ్యర్దిస్తున్నాడని అన్నారు. పాము కాటుకు చికిత్స కోసం ఇప్పటికే చాలా డబ్బు ఖర్చయ్యిందని, తనను ఆదుకోవాలని అతడు కలెక్టర్ ఆఫీసుకు వచ్చి వేడుకున్నట్టు తెలిపారు.
‘‘కలెక్టరేట్‌కు వచ్చిన బాధితుడు పాముకాటుకు వైద్యం చేయించుకోడానికి చాలా డబ్బు వెచ్చించానని, ఇప్పుడు అధికారులు ఆర్థిక సాయం చేయాలని కోరాడు. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోమని నేను అతనికి సలహా ఇచ్చాను.. ఎందుకంటే అక్కడ అతను ఉచితంగా పాము విషానికి యాంటీ వీనమ్ ఇంజెక్షన్ పొందొచ్చు’’ అని అన్నారు. అంతేకాదు, ఆ వ్యక్తిని శనివారం రోజునే పాము కాటు వేయడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని చీఫ్ మెడికల్ ఆఫీసర్ వ్యాఖ్యానించారు. అయితే, అతడ్ని నిజంగా పాము కాటు వేస్తుందా? అనేది తెలియాల్సి ఉందన్నారు.
‘‘అతడు నిజంగా పాము కాటుకు గురవుతున్నాడా. ఆయనకు వైద్యం చేస్తున్న వైద్యుని సమర్థత కూడా చూడాలి. ప్రతి శనివారం ఒక వ్యక్తి పాము కాటుకు గురవుతాడు. ఆ వ్యక్తి ప్రతిసారీ అదే ఆసుపత్రిలో చేరడం,కేవలం ఒక రోజులో కోలుకోవడం వింతగా అనిపిస్తుంది’’ అని పేర్కొన్నారు. ఈ అంశంపై విచారణకు ముగ్గురు వైద్యులతో కూడిన కమిటీని నియమించినట్టు సీఎంఓ వెల్లడించారు. ‘దీనిపై వాస్తవం గురించి ప్రజలకు తెలియాల్సి ఉంది.. అందుకే మేము విచారణ కమిటీ ఏర్పాటు చేశాం’ అని డాక్టర్ రాజీవ్ అన్నారు. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రతిసారీ దూబేను పాము కాటువేయడం.. ఆస్పత్రిలో చికిత్స తర్వాత కోలుకుని ఇంటికి రావడం జరుగుతుంది.
జూన్ 2 న రాత్రి తొలిసారి దూబేను పాము కాటు వేసింది. రాత్రి 9 గంటలకు నిద్రపోయిన అతడు.. మంచంపై నుంచి దిగుతుండగా పాము కరిచింది. దీంతో కుటుంబసభ్యులు అతడ్ని చికిత్స కోసం ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. రెండు రోజుల అనంతరం కోలుకోవడంతో అతడ్ని ఇంటికి తీసుకొచ్చారు. మళ్లీ వారం రోజుల తర్వాత రెండోసారి కాటుకు గురయ్యాడు. జులై 12 మధ్య వికాస్ దూబేను మొత్తం ఏడుసార్లు పాము కాటు వేసింది. అయితే, గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. యూపీలోని ఆగ్రాలో రెండేళ్ల కిందట యువకుడ్ని 10 రోజుల్లో ఐదుసార్లు పాము కాటువేసింది.