కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. అమెరికా ఉపాధ్యక్షురాలు భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ గురువారం ఫోన్‌లో సంభాషించినట్టు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం సాగుతోంది. వారిద్దరి సంభాషణలో నవంబరులో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల గురించే మాట్లాడుకున్నారని కాంగ్రెస్ మద్దతుదారులు, రాహుల్ విధేయులు పేర్కొన్నారు. కొందరు మాత్రం లోక్‌సభ ప్రతిపక్ష నేత కావడంతో మర్యాదపూర్వకంగా ఫోన్ చేసి ఉంటారని కొందరు అంటున్నారు. జో బైడెన్ వైదొలగితే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్ధిగా కమలా హ్యారిస్‌కు పోటీచేసే అవకాశం ఉందనే ప్రచారం ఊపందుకుంది. ఇటీవల బైడెన్ తీరుపై సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అభ్యర్ధిత్వం నుంచి వైదొలగాలనే డిమాండ్ వినిపిస్తోంది.
అయితే, రాహుల్, కమలా హ్యారిస్ ఫోన్ చేసినట్టు జరుగుతోన్న ప్రచారంలో నిజం లేదని తాజాగా తెలిసింది. ఉపాధ్యాక్షురాలి కార్యాలయం ఈ ప్రచారాన్ని ఖండించినట్టు అమెరికాకు చెందిన సీనియర్ స్క్రైబ్ ఒకరు ధ్రువీకరించారు. ‘ఉపాధ్యాక్షుడి కార్యాలయం ప్రకారం ఇది తప్పుడు సమాచారం.. రాహుల్ గాంధీతో కమలా హ్యారిస్ మాట్లాడలేదు’ అని ఆయన ట్వీట్ చేశారు. ఇక, కాంగ్రెస్ సోషల్ మీడియా హ్యాండ్లర్స్ ఈ వార్తను ఖండించలేదు అలాగని ధ్రువీకరించలేదు. కొన్ని సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఉద్దేశపూర్వకంగా ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీనిని నియంత్రించడానికి ఒక యంత్రాంగం ఉండాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న జో బైడెన్‌కు వయసు ఎన్నికల్లో కీలకాంశంగా మారింది. ఆయన తప్పుకోవాలని స్వపక్షం నేతలే డిమాండు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్‌ను ఢీకొట్టాలంటే కమలా హ్యరీస్‌కు మాత్రమే సాధ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అమెరికా కాంగ్రెస్‌లోని 15 మంది డెమొక్రాటిక్ రిప్రజంటేటివ్‌లు ఇప్పటికే బైడెన్‌కు వ్యతిరేకంగా గళం విప్పారు. అలాగే, పలు సర్వేలు సైతం జో బైడెన్ కంటే కమలా ఉత్తమ అభ్యర్ధి అని తేల్చి చెప్పాయి. అయితే, బైడెన్ మాత్రం తాను తప్పుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అవసరమైతే మెడికల్ పరీక్షలకు కూడా సిద్ధమేనని పేర్కొన్నారు.