నర్సు వేషంలో వచ్చిన ఓ మహిళ స్థానిక సర్వజన ప్రభుత్వాసుపత్రిలో మూడు రోజుల పసికందు అపహరించిన కొన్ని గంటల్లోనే శిశువును పోలీసులు తల్లిచెంతకు చేర్చారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఆ ఘటనలో ఆస్పత్రిలోని ఆరుగురు సిబ్బందికి సూపరింటెండెంట్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మచిలీపట్నం , ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామానికి చెందిన స్వరూప జిల్లా సర్వజన ఆసుపత్రిలో ప్రసవం కోసం వచ్చింది. మూడు రోజుల క్రితం మగ శిశువుకు జన్మనిచ్చింది. స్థానిక ఇంగ్లీష్‌పాలేనికి చెందిన తమ్మిశెట్టి లక్ష్మి రెండు రోజులుగా నర్సు వేషంలో ఆసుపత్రిలో తిరుగుతూ స్వరూపతో పరిచయం పెంచుకుంది. శనివారం రాత్రి ఒంటి గంట సమయంలో స్వరూప తన శిశువుకు పాలిచ్చి బాత్‌రూమ్‌కు వెళ్లింది. ఈ సమయంలో అక్కడే ఉన్న లక్ష్మి ఇదే అదనుగా భావించి శిశువును అపహరించి తనతో తీసుకుపోయింది. స్వరూప తనబెడ్ వద్దకు వచ్చి చూడగా శిశువు కనపడలేదు. దీంతో ఆమె ఈ విషయాన్ని ఆసుపత్రి సిబ్బందికి చెప్పింది. ఆసుపత్రి సూపరింటెండెంట్ రమేష్‌కుమార్ మచిలీపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆసుపత్రికి వచ్చి సీసీ కెమెరాలు పరిశీలించగా లక్ష్మీ శిశువును తనతో తీసుకుపోయినట్టు తేలింది. ఈ సమయంలో ఆమెతో పాటు బాలుడు ఉన్నాడు. అపహరించిన శిశువును ఇంగ్లీష్‌పాలెంలోని తన ఇంటివద్దనే ఉంచింది. లక్ష్మీ ఇంటికి వెళ్లిన పోలీసులు ఆదివారం తెల్లవారుజామున 5.30 అదుపులోకి తీసుకున్నారు. శిశువును తల్లికి అప్పగించారు. ఆసుత్రిలో ఇంతా జరుగుతున్నా పట్టించుకోని సెక్యూరిటీగా విధులు నిర్వహిస్తున్న విజయలక్ష్మితోపాటు ముగ్గురు స్టాఫ్‌నర్సులకు, వార్డులో పనిచేస్తున్న మరో ఇద్దరికి ఆసుపత్రి సూపరింటెండెంట్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కన్నబిడ్డ కనపడటంతో స్వరూప ఆనందానికి అవధులు లేవు. శిశువును అపహరించిన లక్ష్మీ నుంచి పోలీసులు వివరాలు రాబట్టే పనిలో ఉన్నారు. ఆమెను గతకొన్ని రోజులుగా నర్సు వేషంలో వార్డులో తిరగడానికి ఎవరు సహకరించారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణచేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని గైనిక్ విభాగంలో నిఘాను పెంచుతామని ప్రజాదర్బార్‌లో మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.