ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఏపీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తుందని ఏపీపీటీడీ(ఆర్టీసీ) ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు, ఏపీజేఏసీ అమరావతి స్టేట్ సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు తెలిపారు. ఏపీలో మెజార్టీ ఉద్యోగులు కోరుకున్న ప్రభుత్వమే నేడు అధికారంలోకి వచ్చిందని చెప్పారు. ఈ ప్రభుత్వంపై ఉద్యోగులు పెట్టుకున్న ఆశలు నెరవేర్చాలని కోరారు. ఆదివారం నెల్లూరులో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సీపీఐ కార్యాలయంలో జిల్లా కమిటీ నిర్మాణ సభ జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పలిశెట్టి దామోదరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగుల విలీనం అనంతరం ఈహెచ్‌ఎస్ ప్రవేశపెట్టే వరకు ఆర్టీసీ సంస్థ ద్వారా పొందే రిఫరల్ ఆస్పత్రుల వైద్య సౌకర్యాలను వైసీపీ ప్రభుత్వం అమానుషంగా తొలగించిందని మండిపడ్డారు. ప్రస్తుతం ప్రతి ఉద్యోగి నుంచి ప్రతినెలా రూ. 225 నుంచి రూ. 300 ల వరకు జీతాల నుంచి రికవరీ చేసిందని తెలిపారు. ఈహెచ్‌ఎస్ (హెల్త్‌స్కీమ్) ద్వారా ఏ ఒక్క ఉద్యోగికి సరైన వైద్య సౌకర్యాలు అందలేదని, దీంతో ఆర్టీసీ కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారని వివరించారు. అలాగే విలీనం పేరుతో ఆర్టీసీ ఉద్యోగులకు దశాబ్దాలుగా ఉన్న అలవెన్సులు, ఇన్సెంటివ్ స్కీమ్‌లను జగన్ ప్రభుత్వం ఏకపక్షంగా తొలగించిందని ధ్వజమెత్తారు.