కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు చేసిన వ్యాఖ్యలు.. ఒక్కోసారి తీవ్ర దుమారానికి కారణం అవుతూ ఉంటాయి. ఇక వాళ్లు ఇచ్చే సలహాలు కొన్నిసార్లు తీవ్ర విమర్శలకు కూడా తావిస్తాయి. అలాగే ఓ బీజేపీ ఎమ్మెల్యే.. తాజాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి కారణం అయ్యాయి. మధ్యప్రదేశ్‌లోని గుణ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే పన్నాలాల్ షాక్య.. స్టూడెంట్స్‌కు ఇచ్చిన సలహా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చదువుకుని డిగ్రీలు చేసి ఏం సాధించలేమని.. పంక్చర్ దుకాణాలు తెరవాలని వారికి సూచించారు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న ఓ ఎమ్మెల్యే.. విద్యార్థులకు ఇలాంటి సూచనలు చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
మధ్యప్రదేశ్‌లోని 55 జిల్లాల్లో ప్రధానమంత్రి కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ పేరుతో ప్రత్యేక కేంద్రాల ఏర్పాటు కార్యక్రమాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ క్రమంలోనే పీఎం కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ కార్యక్రమం ప్రారంభోత్సవంలో గుణ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే పన్నాలాల్ షాక్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే పన్నాలాల్ షాక్య.. పీఎం కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఘనంగా ప్రారంభమైందని తెలిపారు.
అయితే.. డిగ్రీలతో భవిష్యత్తులో పెద్దగా ఉపయోగం ఏమీ ఉండదని పేర్కొన్నారు. అందుకే తాను ఓ సలహా ఇవ్వాలనుకుంటున్నానని పేర్కొన్న పన్నాలాల్ షాక్య.. డిగ్రీలకు బదులుగా జీవనోపాధి కోసం కనీసం మోటార్ సైకిల్ పంక్చర్ రిపేర్ దుకాణాలను తెరవండని సూచించారు. ఈ విషయాన్ని మీరు కచ్చితంగా గుర్తుంచుకోండి అంటూ ఎమ్మెల్యే చెప్పడంతో అక్కడ ఉన్నవారంతా అవాక్కయ్యారు. అయితే ఒక ఎమ్మెల్యే విద్యార్థులకు ఇలాంటి మాటలు చెప్పడం ఏంటని స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఇక ఇండోర్‌లో ఒకే రోజులో 11 లక్షల మొక్కలు నాటి గిన్నిస్ రికార్డు సృష్టించడాన్ని ప్రస్తావించిన ఎమ్మెల్యే పన్నాలాల్ షాక్య.. రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మొక్కలు నాటుతున్నారు.. కానీ ఆ తర్వాత వాటిని పరిరక్షణ గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒకేరోజు 11 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని కేంద్రమంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఇండోర్ సహా అన్ని జిల్లాల్లో అభివృద్ధి చేసిన పీఎం కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్‌లను అమిత్ షా వర్చువల్‌గా ప్రారంభించారు. బట్టీ చదువుల ద్వారా మార్కులు పెరిగినా విద్యార్థుల్లో నైపుణ్యాలు పెరగడం అసాధ్యమని ఈ సందర్భంగా వెల్లడించారు. నూతన విద్యా విధానం కింద ఏర్పాటు చేసిన పీఎం ఎక్స్‌లెన్స్‌లతో విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.