ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేదార్‌నాథ్ ఆలయంలో 228 కిలోల బంగారం మాయం.. వెలుగులోకి సంచలన విషయాలు

national |  Suryaa Desk  | Published : Mon, Jul 15, 2024, 10:56 PM

ఉత్తరాఖండ్‌లోని జ్యోతిర్మఠ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద స్వామి.. కేదార్‌నాథ్ ఆలయం గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెను సంచలనంగా మారాయి. పవిత్రమైన చార్‌ధామ్ క్షేత్రాల్లో ఒకటైన కేదార్‌నాథ్ ఆలయంలో భారీ బంగారం కుంభకోణం జరిగిందని ఆరోపణలు గుప్పించారు. కేదార్‌నాథ్‌ ఆల‌యం నుంచి సుమారు 228 కిలోల బంగారం అదృశ్యమైన‌ట్లు జ్యోతిర్మఠ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద స్వామి వెల్లడించారు. అయితే కేదార్‌నాథ్ ఆలయంలో బంగారం చోరీకి సంబంధించి ఎందుకు లేవనెత్తడం లేదని ప్రశ్నించారు. ఇప్పటివరకు కేదార్‌నాథ్ ఆలయంలో గోల్డ్ స్కామ్ చేశారని.. ఇప్పుడు ఢిల్లీలో కేదార్‌నాథ్ లాంటి ఆలయాన్ని నిర్మిస్తారా అంటూ శంక‌రాచార్య అవిముక్తేశ్వరానంద మండిపడ్డారు.


కేదార్‌నాథ్‌లో గోల్డ్ స్కామ్ జ‌రిగిన‌ట్లు ఆరోపించిన జ్యోతిర్మఠ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద స్వామి.. దాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో కేదార్‌నాథ్ లాంటి ఆల‌యాన్ని నిర్మిస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన అవిముక్తేశ్వరానంద స్వామి.. ఈ వ్యాఖ్యలు చేశారు. కేదార్‌నాథ్‌లో బంగారం మాయం అయిందని.. దాన్ని విచారణ జరపకుండా.. ఇప్పుడు ఢిల్లీలో అలాంటి ఆల‌యాన్ని నిర్మిస్తారా అని విమర్శించారు.


ఇక్కడ కాకుంటే మ‌రో చోట స్కామ్ జ‌రుగుతుంద‌ని మండిపడ్డారు. కేదార్‌నాథ్ ఆల‌యం నుంచి సుమారు 228 కిలోల బంగారం అదృశ్యమైన‌ట్లు ఆరోపించిన అవిముక్తేశ్వరానంద స్వామి.. ఈ కేసు బయటికి వచ్చి ఇన్ని రోజులు అవుతున్నా ఇంతవరకు ద‌ర్యాప్తు జ‌ర‌గ‌లేద‌ని ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా త‌న‌కు ప్రణామాలు చేశార‌ని పేర్కొన్న జ్యోతిర్మఠ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద స్వామి.. త‌మ వద్దకు వ‌చ్చిన‌వారిని దీవించ‌డం త‌మ విధాన‌మ‌ని స్పష్టం చేశారు. అయితే ప్రధాని మోదీ త‌మ‌కు శ‌త్రువు కాదని.. ఎల్లప్పుడూ ఆయ‌న శుభం కోరుకునేవాళ్లమ‌ని తేల్చి చెప్పారు. ప్రధాని సంక్షేమం గురించి తాము ఆలోచిస్తామ‌ని.. కానీ ఒక‌వేళ ఆయ‌న త‌ప్పు చేస్తే.. దాన్ని కూడా ఎత్తి చూపుతామ‌ని అవిముక్తేశ్వరానంద తెలిపారు.


కేదార్‌నాథ్ ఆలయంలో జరిగిన ఈ బంగారం కుంభకోణంపై దర్యాప్తు జరిపించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీదే ఉందని ఆయన తేల్చి చెప్పారు. దర్యాప్తు జరపాలంటూ తాను ఇది వరకే డిమాండ్ చేసినప్పటికీ ఎలాంటి స్పందనా రాలేదని పేర్కొన్నారు. ముంబైలో పర్యటించిన అవిముక్తేశ్వరానంద.. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన ఉద్ధవ్ ఠాక్రే అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో సుమారు 2 గంటల పాటు భేటీ అయ్యారు.


అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. దేశంలో హిందువులం అని చెప్పుకొంటున్న వారు కేదార్‌నాథ్‌లో బంగారం కుంభకోణానికి పాల్పడ్డారని విమర్శించారు. ఇప్పుడు వాళ్లే ఢిల్లీలో కూడా కేదార్‌నాథ్ ఆలయాన్ని నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో ఆలయ నిర్మాణం పేరుతో మరో కుంభకోణానికి తెర తీయనున్నారని పేర్కొన్నారు. ఢిల్లీలో నిర్మించాలనుకుంటున్న కేదార్‌నాథ్ ఆలయం ఎప్పటికీ జ్యోతిర్లింగం కాబోదని తేల్చి చెప్పారు. ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయని.. ఇందులో ఒకటి హిమాలయాల్లో వెలిసిందని శివపురాణం చెబుతోందని పేర్కొన్న అవిముక్తేశ్వరానంద.. అలాంటప్పుడు ఢిల్లీలో నిర్మించే ఆలయం జ్యోతిర్లింగ్ ఎలా అవుతుందని ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com