ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రగిరిలో అక్రమాలపై విచారణ చేపట్టిన సీఐడీ అధికారుల బృందం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 17, 2024, 08:42 PM

తిరుపతి ఆర్డీవో, తుడా కార్యాలయాల్లో సీఐడీ అధికారులు మంగళవారం విచారణ జరపడం కలకలం రేపింది. చంద్రగిరి నియోజకవర్గంలో చేపట్టిన ఓటర్ల నమోదులో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయని ఎమ్మెల్యే పులివర్తి నానీ చేసిన ఫిర్యాదుపై ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన సీఐడీ అధికారుల బృందం విచారణ చేపట్టింది. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గంలో ఓటర్ల నమోదులో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయని టీడీపీ నేతలు, కార్యకర్తల నుంచీ అసంఖ్యాకంగా ఫిర్యాదులందాయి. కలెక్టర్‌ మొదలుకుని కేంద్ర ఎన్నికల కమిషన్‌ దాకా ఫిర్యాదులు వెళ్ళాయి. తిరుపతి ఆర్డీవో నుంచీ కిందిస్థాయిలో బీఎల్వోల దాకా అధికారులు, సిబ్బంది అప్పటి అధికార పార్టీ వైసీపీకి అనుకూలంగా పనిచేశారని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. దొంగ ఓట్లు భారీగా చేర్పించారని, టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించారని ఆధారాలు కూడా జత చేశారు. అయితే ప్రభుత్వం వీటిపై స్పందించలేదు. ఎన్నికల సంఘం వివరణ కోరినా అధికారులు నామమాత్రపు చర్యలతో సరిపుచ్చారనే ఆరోపణలున్నాయి. ఎన్నికలు ముగిశాక ఎమ్మెల్యేగా గెలుపొందిన పులివర్తి నానీ మళ్ళీ దీనిపై ప్రభుత్వానికి, సీఐడీ విభాగానికీ ఫిర్యాదు చేశారు. ప్రత్యేకించి గూడూరు ఆర్డీవో మీసాల కిరణ్‌కుమార్‌ ప్రమేయంపై ఆరోపణలు చేశారు.గత వైసీపీ ప్రభుత్వంలో తిరుపతి రూరల్‌ తహసిల్దారుగా పనిచేసిన ఆయన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డితో అంటకాగారనే ఆరోపణలున్నాయి. డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి వచ్చాక ప్రభుత్వ విప్‌ హోదాలో చెవిరెడ్డికి ఓఎస్డీగా నియమితులయ్యారు.తర్వాత గూడూరు ఆర్డీవోగా నియమితులయ్యారు. గూడూరు ఆర్డీవోగా పనిచేస్తూనే వారంలో ఐదు రోజుల పాటు తిరుపతిలోని ఎయిర్‌ బైపాస్‌ రోడ్డులో వున్న చెవిరెడ్డి వ్యక్తిగత కార్యాలయంలో మకాం వేసేవారని, చంద్రగిరి పరిధిలోని ఆరు మండలాల తహసిల్దార్లను, తిరుపతి ఆర్డీవోను అక్కడికి పిలిపించుకుని బోగస్‌ ఓటర్లను చేర్పించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆర్డీవో, తహసిల్దార్ల లాగిన్ల పాస్‌వర్డులు తీసుకుని బోగస్‌ ఓటర్లను చేర్పించడం, టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించడం చేశారని పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa