రోగులకు వైద్యసేవలు అందజేసే విషయంలో జీజీహెచ్ వైద్యులు, సిబ్బంది జవాబుదారీతనం కలిగి ఉండాలని రాజమహేంద్రవరం కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. రాజమహేంద్రవరం జీజీహెచ్‌ను మంగళవారం కలెక్టర్ సందర్శించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు స్వీకరించడానికి ఆర్‌ఎంవో ఫోన్ నెంబరును ఆసుపత్రి ఆవరణలో ప్రముఖంగా ప్రదర్శించాలని ఆదేశించారు. ఓపీలోని పలు విభాగాలను తనిఖీ చేశారు. క్యాజువాలిటీ వార్డును పరిశీలించారు. క్యాజువాలిటీ వద్ద రోగులకు వీల్‌ఛైర్లు, స్ర్టెచర్లు వంటివి అందుబాటులో ఉంచడంలేదని కలెక్టర్‌కు పలువురు ఫిర్యాదు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వాసుపత్రికి వచ్చే రోగుల్లో ఎక్కువ మంది సాధారణ, పేద ప్రజానీకం ఉంటారని మెరుగైన వైద్యసేవలు అందజేయాలన్నారు. ఆసుపత్రిలో రోగులు, వారి సహాయకులు వేచి ఉండడానికి మూడు వరుసల్లో స్టీల్ కుర్చీలకు చర్యలు తీసుకోవాలన్నారు. రోగులకు అందుబాటులో వీల్‌ఛైర్లు, స్ర్టెచర్ ఏర్పాటుకు, అదనపు సిబ్బందికి ప్రతిపాదనలు పంపాలని వైద్యాధికారులను ఆదేశించారు. ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి చర్యల్లో భాగంగా త్వరలోనే ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించాలన్నారు. రోగుల బంధువుల కు అదనపు టాయిలెట్లు ఏర్పాటు చేయాలన్నారు. ఆమె వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీసూర్యప్రభ, ఆర్‌ఎంవో డాక్టర్ ప్రణవ్, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్.కృష్ణంరాజు, వైద్యులు ఉన్నారు.