శ్రీకాకుళం జిల్లా, సరుబుజ్జిలి మండలం లోని పెద్దసవలాపురం సమీ పంలో వంశధార నదిలోగల ఇసుక ర్యాంప్‌లో మంగళవారం పోలీస్ పహరా ఏర్పాటు చేశారు. పెద్ద సవలాపురంలో అక్రమంగా ఇసుక ర్యాంపు నిర్వహించి యంత్రాలు, ట్రాక్టర్లతో అనధికారికంగా రవాణాచేస్తున్నారని, కొంతమంది నాయకులు పుకార్లు పుట్టించారు. దీంతో గ్రామంలో రెండు వర్గాల మధ్య మనస్పర్థలు ఏర్పడి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశముందని ముందస్తుసమాచారం మేరకు జిల్లాయంత్రాంగం పోలీ సులను అప్రమత్తంచేసింది. ఈనేపథ్యంలో మంగళవారం తెల్లవారుజామున ఆమదాలవలస, బూర్జ ఎస్‌ఐలు కె.వెంకటేష్, ప్రసాద్ సిబ్బందితో పాటు స్థానిక సరుబుజ్జిలి స్టేషన్ సిబ్బందితో ఆ గ్రామానికి చేరుకున్నారు. గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు బద్రి రామారావుతో ఎస్‌ఐ ప్రసాద్ మాట్లాడి పోలీసులకు సహకరించాలని కోరారు. రెవెన్యూ అధికారులు కూడా పెద్దసవలాపురం గ్రామాన్ని సందర్శించి ఇసుక ర్యాంప్ ప్రాంతాన్ని పరిశీలించారు.