ఈనెల 18 నుంచి ప్రతి గురువారం మండల స్థాయి అధికారులతోపాటు ప్రత్యేక అధికారి ఓ గ్రామానికి వెళ్లి ప్రభుత్వ పథకాల అమలుపై ఆరా తీసి, అక్కడున్న సమస్యలను గుర్తించనున్నారు. ఇందుకోసం కలెక్టర్ ప్రతి మండలానికీ ఒక నోడల్ అధికారిని నియమించిన సంగతి తెలిసిందే. ఆ అధికారి అధ్వర్యంలో తహసీల్దారు, ఎంపీడీవో, ఇతర మండల స్థాయి అధికారుల బృందం మండలంలో ఎంపిక చేసుకున్న గ్రామం, పట్టణాల్లో అయితే వార్డును గురువారం సందర్శిస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ అక్కడే ఉంటారు. ప్రజల సమస్యలు తెలుసుకుని మండల స్థాయిలో పరిష్కరించగలిగిన వాటిని అక్కడే పరిష్కారం చూపుతారు. అక్కడ కాకుంటే జిల్లా స్థాయి అధికారులకు నివేదించాల్సి ఉంటుంది. ముందుగా గ్రామంలోని ప్రభుత్వ సంస్థలను సందర్శించి ఉద్యోగుల పని తీరును, ఆ సంస్థల ద్వారా ప్రజలకు అందుతున్న సేవలను సమీక్షించనున్నారు. పారిశుధ్య పరిస్థితులు పరిశీ లించి మెరుగుపరచడం, తాగునీటి సరఫరా, ప్రజారోగ్యం తెలుసుకుని వాటిని మెరుగుపరిచే దిశగా చర్యలు చేపడ్తారు. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు, విద్యార్థుల విషయం పరిజ్ఞానం పరిశీలన, స్కూల్ కిట్ల పంపిణీని పరిశీలిస్తారు. అంగన్‌వాడీ కేంద్రాలు, రైతు సేవా కేంద్రాలు, రేషన్ దుకాణాల ద్వారా అందుతున్న సేవలను సమీక్షించనున్నారు. అలాగే నోడల్ అధికారితో పాటు మండల స్థాయి అధికారులు వారి పరిధిలో ఉన్న సంక్షేమ వసతిగృహంలో ప్రతి నెల ఒక గురువారం రాత్రి బస చేయనున్నారు. వసతిగృహాల్లో ఉన్న సమస్యలు గుర్తించి కలెక్టర్‌కు నివేదించనున్నారు.