ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయంగా వేసే ప్రతి అడుగు.. చేసే ప్రతి వ్యాఖ్య కూడా ఓ సంచలనమే. తాజాగా పవన్ కళ్యాణ్ మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. తనను ఉదాహరణగా చెప్తూనే సొంత పార్టీ నేతలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. సోమవారం ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు జులై 26వ తేదీ వరకూ కొనసాగనున్నాయి. తొలి రోజు గవర్నర్ ప్రసంగించగా.. రెండో రోజైన మంగళవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ వేదికగానే జనసేన పార్టీ తరుఫున ఎన్నికైన ఎమ్మెల్యేలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్.
ఏపీ భవిష్యత్తు, రాష్ట్ర పునర్నిర్మాణం కోసం జనసేన పార్టీ టీడీపీ కూటమి ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో ఏపీ ఖజానా ఖాళీ కావటంతో పాటు రాజధాని అమరావతి నిర్మాణం, జీవనాడి పోలవరం ప్రాజెక్టు గిపోయాయని విమర్శించారు. సహజ వనరులు దోపిడీకి గురయ్యాయని, శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో రాజకీయాల్లో సుధీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు అవసరం రాష్ట్రానికి ఎంతో ఉందన్న పవన్ కళ్యాణ్.. ఆయన ఆధ్వర్యంలో రాష్ట్ర అభివృద్ధికి కలిసి పనిచేస్తామని చెప్పారు. ఈ క్రమంలోనే జనసేన పార్టీ నేతలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
" ఉచిత ఇసుక వంటి వ్యవహారాల్లో జనసేన సభ్యుల పాత్ర ఉండకూడదు. కూటమి ప్రభుత్వానికి ఇబ్బందులు కలుగజేసేలా వ్యవహరిస్తే ఏ సభ్యుడినైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నా. తప్పులు చేస్తే నాతో సహా ఎంతటివారైనా చట్టపరంగా చర్యలు తీసుకోండి. వ్యక్తులు తప్పులు చేస్తే వ్యక్తిగతంగా వారికే ఆపాదించాలి కానీ పార్టీలకు కాదు. రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు కనుసన్నల్లో పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా" అని పవన్ కళ్యాణ్ అన్నారు. దీంతో కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా జనసేన ఎమ్మెల్యేలు ఎవరూ నడుచుకోవద్దంటూ అసెంబ్లీ వేదికగానే జనసేనాని స్వీట్ వార్నింగ్ ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.