కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో ఉద్యోగాల కల్పన, యువతలో నైపుణ్యాభివృద్ధికి కేంద్రం పెద్దపీట వేసింది. ముఖ్యంగా ఉద్యోగాల కల్పనను ప్రోత్సహించే దిశగా కేంద్రం కొత్త పథకాలు ప్రవేశపెట్టింది. ప్రధానమంత్రి ప్యాకేజీ కింద మూడు పథకాలను తీసుకువస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇందులో భాగంగా తొలిసారిగా ఉద్యోగంలో చేరేవారికి నెల వేతనాన్ని కేంద్రం అందిస్తుందని చెప్పారు. రూ. లక్షలోపు జీతం ఉన్న ఉద్యోగాలకు ఇది వర్తిస్తుందన్న నిర్మలా సీతారామన్.. గరిష్టంగా 15 వేల రూపాయలు అందిస్తామన్నారు. ఈ మొత్తాన్ని మూడు వాయిదాల్లో ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా వారికి చెల్లిస్తామని ప్రకటించారు. అయితే కేంద్రం ప్రకటించిన ఈ పథకాన్ని అభినందిస్తూ వైసీపీ ట్వీట్ చేసింది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాలనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుందని వైసీపీ ట్వీట్ చేసింది. కొత్తగా ఉద్యోగంలో చేరే వారి కోసం కేంద్రం తొలిసారి డీబీటీ పద్ధతిలో డబ్బు పంపిణీకి నిర్ణయం తీసుకుందంటూ వైసీపీ ట్వీట్ చేసింది. ఏపీలో లంచం, మధ్యవర్తిత్వం ప్రస్తావన లేకుండా లబ్ధిదారులకి ఏకంగా రూ. 2.70లక్షల కోట్లను డీబీటీ పథకాల ద్వారా వైఎస్ జగన్ ప్రభుత్వం పంపిణీ చేసిందని ఈ ట్వీట్లో రాసుకొచ్చింది. వైఎస్ జగన్ డీబీటీ పద్ధతిని మోదీ సర్కారు కూడా ఫాలో అవుతోందంటూ ట్వీట్ చేసింది. అయితే దీనిపై కొంతమంది నెటిజనం విమర్శలు కూడా గుప్పిస్తున్నారు
2019 నుంచి 2024 వరకూ ఏపీలో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం పరిపాలన సాగింది. ఈ కాలంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని అర్హులకు అందించేందుకు వైఎస్ జగన్ ప్రత్యక్ష నగదు బదిలీని ఉపయోగించారు. సామాజిక భద్రతా పింఛన్లు వంటి వాటిని వాలంటీర్ల ద్వారా ఇంటివద్దకే అందిస్తూనే.. వైఎస్ఆర్ రైతుభరోసా, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన సహా పలు పథకాల లబ్ధిని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తూ వచ్చారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా అర్హులకే లబ్ధి చేకూరాలనే ఉద్దేశం వైఎస్ జగన్ ఈ విధానం అనుసరించారు. ప్రస్తుతం కేంద్రం కూడా తొలిసారిగా ఉద్యోగాల్లో చేరేవారికి డీబీటీ ద్వారా వేతనం అందిస్తామని చెప్పడంతో మోదీ కూడా వైఎస్ జగన్‌ను ఫాలో అవుతున్నారని వైసీపీ అంటోంది.