రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ప్రసంగంలో పచ్చి అబద్ధాలు వల్లె వేసిందని, అసెంబ్లీ సాక్షిగా నయ వంచన చేసిందని యర్రగొండపాలెం వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆక్షేపించారు. చంద్రబాబు హయాంలో అద్భుతాలు చోటు చేసుకోగా, గత వైయస్సార్‌సీపీ ప్రభుత్వంలో విధ్వంసం జరిగిందంటూ అసత్యాలు పలికించారని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్రంలో గత 45 రోజులుగా కొనసాగుతున్న హత్యలు, దాడులు, అరాచకాలు, దౌర్జన్యాలు, ఆస్తుల విధ్వంసం.. పూర్తిగా క్షీణించిన శాంతి భద్రతలను ప్రశ్నిస్తూ.. తామంతా మెడలో నల్ల కండువాలతో సభకు వస్తుంటే గేటు వద్ద అడ్డుకున్నారని, ఇది అనైతిక చర్య అని ఎమ్మెల్యే చంద్రశేఖర్ స్పష్టం చేశారు. తమ ప్లకార్డులు లాక్కుని, చించివేయడాన్ని తప్పుబట్టారు. తాము నిరసన వ్యక్తం చేయడం దారుణమా? అని ప్రశ్నించారు.