కృష్ణాజిల్లా పమిడిముక్కల మండలం మంటాడలో తాజాగా ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. పేటేటి స్రవంతి(28) అనే వివాహిత చరవాణికి రూ.5లక్షలు రుణం ఇస్తామంటూ మెసేజ్ వచ్చింది. కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండడంతో ఆ నంబరుకు మహిళ ఫోన్ చేసింది. లోన్ ఇస్తామని చెప్పిన కేటుగాళ్లు అందుకు ముందుగా కొంత నగదు చెల్లించాలని చెప్పారు. దాంతో భర్త శ్రీకాంత్‌కు తెలియకుండా అప్పు చేసి మరీ విడతల వారీగా రూ.లక్ష వరకు చెల్లించింది. మరో రూ.1.20లక్షలు చెల్లిస్తే గాని మొత్తం రుణం ఇవ్వడం కుదరని చెప్పడంతో మోసపోయినట్లు గుర్తించింది. దీంతో ఆమె ఆదివారం రోజున ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం విజయవాడకు తరలించారు. చికిత్సపొందుతూ వివాహిత సోమవారం మధ్యాహ్నం మృతి చెందింది. ఆత్మహత్యకు ముందు స్రవంతి తీసిన సెల్ఫీ వీడియో సంచలనం సృష్టించింది. "తప్పు చేశా బావా, కుటుంబం కోసం అప్పు తీసుకోవాడానికి చూశా. కానీ వాళ్లు నన్ను మోసం చేశారు. నా ముఖం నీకు చూపించలేను. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్న" అంటూ ఆమె చెప్పిన మాటలు కుటుంబాన్ని తీవ్ర శోకసంద్రంలోకి నెట్టాయి.